హైదరాబాద్: 2007లో షారుక్ ఖాన్కు, సంజయ్ లీలా భన్సాలీకి ఓం శాంతి ఓం – సావరియా చిత్రాల ద్వారా పోటీ పడింది. నాటి పోటీలో షారుకే గెలిచాడు. మళ్ళీ 2015లో వీళ్ళిద్దరికీ దిల్వాలే, బాజీరావ్ మస్తానీ చిత్రాలతో పోటీ పడింది. ఈ సారి కూడా షారుకే గెలిచాడని మొదటి వీకెండ్ తర్వాత అందరూ అనుకున్నారు. అయితే పదిరోజుల తర్వాత చూస్తే బాజీరావ్ మస్తానీయే విజేత అని తేలింది.
దిల్వాలే చిత్రంపై విశ్లేషకులు మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. మరోవైపు బాజీరావ్ మస్తానీపై ప్రశంశలు గుప్పించారు. ప్రేక్షకులు మాత్రం తొలి మూడురోజులూ షారుక్కే బ్రహ్మరథం పట్టారు. అయితే ఆ తర్వాత అసలు మేజిక్ మొదలయింది. సోమవారం దిల్వాలే రు.10.09 కోట్లు వసూలు చేయగా బాజీరావ్ రు.10.25 కోట్లు ఆర్జించింది. ఇక అక్కడనుంచి నువ్వా-నేనా అన్నట్లు పోటీ సాగుతోంది. బాజీరావ్ దిల్వాలే కంటే తక్కువ ధియేటర్లలో రిలీజ్ అవటం ఇక్కడ గమనించాల్సిన అంశం. మొదటి వారం ముగిసేసరికి దిల్వాలే కలెక్షన్లు తగ్గుముఖం పడుతుండగా, బాజీరావ్ మాత్రం ఒకే వేగంతో సాగిపోతోంది. ఓవర్సీస్ మార్కెట్లో షారుక్ బ్రాండ్ వేల్యూ బలంగా ఉంది కాబట్టి అక్కడ అదే ముందుండొచ్చుగానీ, ఇండియా కలెక్షన్స్లోమాత్రం బాజీరావ్ మస్తానీయే ముందంజలో ఉంటుందని తరుణ్ ఆదర్శ్వంటి సినీ పండితులు విశ్లేషించారు.