హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపురెడ్డిపై 158 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మలో టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్ బలం తక్కువ ఉన్నా, జడ్పీటీసీ, ఎమ్పీటీసీలను తమవైపుకు తిప్పుకోవటంద్వారా విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలుపొందారు. మరో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి శంబీపూర్ రాజు ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లద్వారా విజయాన్ని కైవసం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు. ఇక్కడే మరోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ రెండు స్థానాలలో గెలుపొందటంతో ఆ పార్టీలో కాస్త ఉత్సాహం వచ్చినట్లయింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన సోదరుడు రాజగోపాలరెడ్డి విజయం టీఆర్ఎస్కు గుణపాఠం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 100 స్థానాలు గెలుచుకుని తీరతామని చెప్పారు. మొత్తం 12 స్థానాలలో ఆరుస్థానాలలో టీఆర్ఎస్ ఇప్పటికీ ఏకగ్రీవంగా గెలుపొందగా, ఎన్నికలు జరిగిన ఆరు స్థానాలలో నాలుగింటిలో గెలుపొందినట్లయింది.