మహాక్షేత్రాలను దర్శిస్తుంటే అనేకమైన అనుభవాలతోపాటుగా, అక్కడి మహిమాన్మితమైన చరిత్ర కళ్లముందు నిలుస్తుంటుంది. ఇది సత్యమనడానికి నిదర్శనం, ఈమధ్య భద్రాచలం వెళ్ళినప్పుడు ఏనాడో జరిగిన వింత సంఘటన తాలూకు పూర్వాపరాలు తెలుసుకునే భాగ్యం కలగడం.
చాలాకాలం క్రిందట, అఖండ గోదావరినదిలో పాపికొండల మధ్యగా పడవల మీద సాగుతున్న భక్తులకు నదీ గర్భం నుంచి బొబ్బలు (ఒక రకమైన కేకలు) వినిపించాయి. ఎవరు పెట్టారు ఈ బొబ్బలు ? ఇందుకు సంబంధించిన సంఘటన పూర్వాపరాలు ఒక గట్టుమీదున్న ఆలయానికి వెళితే, కళ్లముందు సాక్షాత్కరించాయి.
భద్రాచలం అనగానే శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం గుర్తుకువస్తుంది. భద్రగిరినెక్కి అక్కడ వెలసిన సీతారాములను భక్తితో సేవించి తొందరలో తిరుగుప్రయాణం కడుతుంటారు. అక్కడకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు వెళ్లేందుకు కూడా కొంతమంది భక్తులకు కుదరదు. లౌకిక కార్యాల వొత్తిళ్లు అలాంటివి. ఇక అలాంటప్పుడు ఈ `బొబ్బల’ కథ ఎవరు పట్టించుకుంటారు ? కాస్తంత నిలకడగా సాగుతుంటే క్షేత్ర మహత్మ్యం తెలుస్తుంది. శ్రీ సీతారామ చంద్రస్వామి స్వయంభువులుగా వెలసిన భద్రగిరికి ఎదురుగానే ఓ చిన్న గుట్ట ఉంది. ఆ గుట్టమీద పవిత్ర గోదావరికి అభిముఖంగా శ్రీయోగానంద లక్ష్మీనృసింహ స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామి యోగముద్రలో ఉంటారు. స్వామివారి కంఠహారములో శ్రీ లక్ష్మీ అమ్మవారు కొలువైఉన్నారు. ప్రశాంతంగా యోగాసనంపై కూర్చుని ఉన్న ఈ నరసింహుడే నడి గోదావరిలో ఒకనాడు బొబ్బలు పెట్టారు. ఇదే ఈ క్షేత్ర మహిమ. పాపికొండల నడుమ పావన గోదావరి నదీ గర్భంలోని సుడిగుండాల మధ్య ఈ నృసింహస్వామి ఆవిర్భవించారు. ఆ సంఘటన పూర్వాపరాలు ఇవి….
చాలాకాలం క్రిందట భద్రాచల క్షేత్రానికి వెళ్లాలంటే గోదావరి నదీ మార్గమే సురక్షితం. చుట్టూ అడవులు, లోయలున్న ప్రాంతం కావడంతో మిగతా ఏ మార్గం నుంచి వెళ్లాలన్నా వన్యమృగాల బెడదతో పాటుగా దోపిడీ దొంగల భయం ఉండేది. అప్పట్లో సురక్షిత రహదారి ఉండేదికాదు. అందుకే ఎక్కువ మంది యాత్రికులు నదీమార్గాన్నే ఎంచుకునేవారు. లాంచీలు, పడవలెక్కి ప్రయాణిస్తుండేవారు. పాపికొండల మధ్య నుంచి ప్రయాణం చేయాల్సివచ్చేది. అక్కడకు చేరేసరికీ, ఎవరో లాగినట్లుగా లాంచీలు, పడవలు ఆగిపోయేవి ! పైగా నదిలోపలి నుంచి వింత శబ్దం అదేపనిగా వస్తుండేది !! మొదట్లో ప్రయాణీకులు భయపడ్డారు. భద్రాద్రి రాముడ్ని చూద్దామని బయలుదేరితే, నడుమ ఈ అడ్డంకి ఏమిటా అని దిగులుపడేవారు. ఆ తర్వాత అక్కడకు చేరగానే పసుపు,కుంకుమలను, కొబ్బరికాయలు కొట్టి చిప్పలను నదిలోకి వేసి ప్రార్థించగానే ప్రయాణం యథాప్రకారం సాగుతుండేది.
ఏమిటీ మహిమ ? తెలుసుకోవాలన్న సంకల్పంతో పండితులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తూ, గజ ఈతగాళ్లతో ఆ నదీ గర్భంలో వెతికించారు. అప్పుడు వారికి ఆశ్చర్యకరంగా పెడబొబ్బలు వినిపించాయి. పెద్దగా ఓంకారనాదంలాంటి శబ్దం వినిపిస్తున్న దిశగా గజఈతగాళ్లు వెళ్ళి వెతికితే, అక్కడ వారికి ఒక విగ్రహం కనిపించింది. ఎంతో భక్తిప్రపత్తులతో వారు ఆ విగ్రహాన్ని పైకి తీసుకొచ్చారు. ఆ విగ్రహమే యోగానంద నరసింహమూర్తి . పెడబొబ్బలు పెడుతూ సాక్షాత్కారించారు కాబట్టి, ఈ స్వామని `బొబ్బల నరసింహుడ’ని కూడా పిలిచేవారు. అలా సాక్షాత్కరించిన బొబ్బల నరసింహుడ్ని మేళతాళాలు, వేదనాదాల నడుమ ఊర్లోకి తీసుకొచ్చి గోదావరి తీరంలోని గుట్టమీద క్షేత్రపాలకునిగా ప్రతిష్టించారు. నదిలో నరసింహస్వామివారి విగ్రహం మాత్రమే లభ్యమైంది. అమ్మవారి విగ్రహం దొరకలేదు. అయితే, అమ్మలేకుండా స్వామివారినొక్కరినే ప్రతిష్టించకూడదన్న నియమానుసారంగా, స్వామివారి కంఠసీమలో `నిత్యానపాయిని’గా లక్ష్మీహారాన్ని ప్రతిష్టించి పూజాదికాలు చేయడం ప్రారంభించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా విగ్రహం లేకపోవడానికి ఇదే కారణం. ఆ నాటి నుంచీ యోగానంద లక్ష్మీనృసింహస్వామివారు భద్రాద్రికి క్షేత్రపాలకునిగా ఉంటున్నారు. శాస్త్ర నియమానుసారంగా, ఎవరు భద్రాచలం వెళ్ళినా ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, ఆ వెంటనే క్షేత్రపాలకుడైన యోగానంద నృసింహస్వామివారిని దర్శించుకోవాలి. ఆ తర్వాతనే శ్రీ సీతారామాంజనేయ స్వామివార్లను సేవించాలి. వైశాఖ పూర్ణిమనాడు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారికి కల్యాణమహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. దుష్టగ్రహ పీడలున్నవారు, భూతప్రేత పిశాచి బాధలున్నవారు స్వామివారిని సేవిస్తే ఆ దోషాలు పోతాయని స్థానిక పెద్దలు చెబుతున్నారు.
భద్రాచల రామ క్షేత్రానికి ఎలాంటి దోషాలు రాకుండా పవిత్రత చెడకుండా ఉండేందుకే నరసింహమూర్తి నదీగర్భం నుంచి బొబ్బలు పెడుతూ ప్రకటితమయ్యారన్నది పెద్దల విశ్వాసం. అదే నిజమనడానికి అనేక తార్కాణాలున్నాయి. భద్రాద్రి వెళ్ళినప్పుడు ఈ బొబ్బల నరసింహుడ్ని చూడటం, స్వామివారిని సేవించడం మరచిపోకండి.
– కణ్వస