రాష్ట్ర విభజనకు ముందు నుండే ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెదేపా, తెరాస ప్రభుత్వాలు నిత్యం ఏదో ఒక అంశంపై గొడవలు పడుతూ మరింత పెంచాయి. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో రెండు ప్రభుత్వాల మధ్య దాదాపు యుద్ద వాతావరణం ఏర్పడింది. కానీ ఎవరు మధ్యవర్తిత్వం పుణ్యమో గానీ మెల్లగా ఆ యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. బహుశః ఆ రాజీ కారణంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకి మారిపోయారేమో కూడా తెలియదు. కానీ అప్పటి నుండే పరిస్థితులలో వేగంగా మార్పులు కనబడటం మొదలయింది. అమరావతి శంఖుస్థాపన, ఆయుత చండీయాగానికి ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరినొకరు ఆహ్వానించుకోవడంతో పరిస్థితులు పూర్తిగా చక్కబడినట్లే కనబడుతున్నాయి. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఏర్పడటంతో ప్రభుత్వాల మధ్య ఘర్షణ తగ్గింది. అంటే ఈ సమస్యకు మూలం విభజన సమస్యలు కావని ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వమే ప్రధాన కారణమని అర్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో తెదేపాకు ఎదురు ఉండకూడదని చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఆశిస్తారో, అలాగే తెలంగాణాలో తెరాసకు ఎదురు ఉండకూడదని కేసీఆర్ ఆశించడం చాలా సహజం. తెలంగాణాలో తెరాసకు తెదేపా సవాలు విసురుతునందునే, చంద్రబాబు నాయుడుని కేసీఆర్ శత్రువుగా భావించి ఉండవచ్చును. కారణాలు ఎవయితేనేమి చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలలో వేలు పెట్టకూడదని నిర్ణయించుకొన్నారు. అలాగే తెలంగాణా ప్రభుత్వంతో సామరస్యంగా వ్యవహరించాలని ఆయన మొదటి నుంచి భావిస్తున్నారు కనుక ఇప్పుడు ఆయనతో కేసీఆర్ కి ఎటువంటి సమస్యలు లేవు. కనుక ఇరు ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం బాగా తగ్గిపోయింది. కానీ అందుకు చంద్రబాబు నాయుడు చాలా బారీ మూల్యం చెల్లిస్తున్నారని చెప్పక తప్పదు.
ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో తన పార్టీ నేతలని నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డు మీద వదిలిపెట్టి ఏవిధంగా ఆంధ్రాకు తరలిపోయారో, సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే తెలంగాణా తెదేపా నేతలని కేసీఆర్ దయాదాక్షిణ్యాలకి విడిచిపెట్టేసినట్లు కనిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇదే వైఖరి కొనసాగించినట్లయితే త్వరలోనే తెలంగాణా రాష్ట్రంలో తెదేపా కనబడకుండాపోయే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇరువురు ముఖ్యమంత్రులకు జరిగిన యుద్ధంలో అంతిమంగా కేసీఆరే గెలిచినట్లు భావించవలసి ఉంటుంది. అయితే ఈ శాంతి స్థాపన కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని బలిచేసుకోవాలా? అని ఆలోచిస్తే అవసరం లేదనే చెప్పవచ్చును. బలమయిన క్యాడర్ ఉన్న తెదేపాను కేసీఆర్ దయాదాక్షిణ్యాలకి విడిచిపెట్టే బదులు, తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తూనే వీలయితే తెరాసకి మిత్రపక్షంగా మారడటం వలన తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకో తన పార్టీని బలిచేసుకోవడానికే సిద్దపడుతున్నట్లున్నారు.