హైదరాబాద్: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక ఇవాళ బయటపెట్టిన ఆడియో టేప్‌ల కథనం ఛత్తీస్‌గడ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. 2014లో అంతాగడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార భారతీయ జనతాపార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిందని చెబుతూ దానికి సంబంధించి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అల్లుడు పునీత్ గుప్తాకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి, కాంగ్రెస్ అభ్యర్థి మంతూరామ్ పవార్‌లకు మధ్య జరిగినట్లుగా చెబుతున్న టెలిఫోన్ సంభాషణల ఆడియో టేపులను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక బయటపెట్టింది.
గత ఏడాది జరిగిన ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంతూరామ్ పవార్ ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి వైదొలగటంతో బీజేపీ అభ్యర్థి భోజ్ రాజ్ నాగ్ సునాయాసంగా గెలిచారు. ఇదిలా ఉంటే ఎన్నికల బరిలోనుంచి అభ్యర్థి వైదొలగటానికి డబ్బు ఇవ్వజూపినట్లు ఆరోపణ వచ్చినందున ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది. అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి షోకాజ్ నోటీస్ కూడా జారీచేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, బీజేపీకి సంబంధం లేదని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు.