పతంజలి ఉత్పతులలో గోమూత్రం వినియోగిస్తునందున వాటిని ముస్లింలు ఎవరూ వాడరాదని తమిళనాడుకు చెందిన తౌహీద్ జమాత్ అనే ముస్లిం మత సంస్థ మూడు రోజుల క్రితం ఒక ఫత్వా జారీ చేసింది. ఇస్లాం మతం గోమూత్రం వాడటం తప్పుగా భావిస్తుంది కనుక దానితో తయారవుతున్న పతంజలి ఉత్పత్తులను ముస్లింలు అందరూ బహిష్కరించాలని ఫత్వాలో పేర్కొంది. ఊహించినట్లే ఆ ఫత్వాపై పతంజలి సంస్థ వెంటనే స్పందించింది.
“మా పతంజలి సంస్థ 700కి పైగా వివిధ రకాల ఉత్పత్తులు చేస్తుంది. వాటిలో కేవలం ఐదింటిలో మాత్రమే గోమూత్రం వాడుతాము. ఆ విషయం సదరు ఉత్పత్తుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొంటాము. దానిని రహస్యంగా ఉంచవలసిన అవసరమేమీ లేదు. మా సంస్థ తయారు చేసే ప్రతీ ఉత్పత్తిపై దాని పూర్తి వివరాలను పేర్కొంటాము. కనుక మా అన్ని ఉత్పత్తులలో గోమూత్రం వాడుతున్నామన్న ఆరోపణ సరికాదు. మా ఉత్పత్తులను వాడవద్దని ఫత్వా జారీ చేసిన సంస్థకు వాటి గురించి సరయిన అవగాహన లేకపోవడం చేతనే వాటిని బహిష్కరించాలని కోరినట్లుంది. పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తులన్నీ ఏ మతం, ప్రాంతానికి చెందినవారయినా వాడేవిధంగానే తయారుచేసాము. కనుక మా ఉత్పత్తులపై ప్రజలు ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోనవసరం లేదు. అందరూ ఉపయోగించవచ్చును,” అని బాబా రాందేవ్ శిష్యుడు బాలకృష్ణ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.