ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 12స్థానాలలో 10 స్థానాలను తెరాస కైవసం చేసుకొని తన సత్తా చాటుకొంది. పదేళ్ళు ఎదురులేకుండా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లతో తృప్తి పడవలసివచ్చింది. ఆ రెంటిలో నల్గొండ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుచుకొన్నారు. అయితే ఆయన ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచారని తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర రెడ్డి వాదిస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలిచేందుకు కోమటిరెడ్డి సోదరులు మొత్తం 139 స్విష్ట్ కార్లను పంచిపెట్టారని ఆరోపించారు. అంతేకాక మహిళ ఎమ్.పి.టి.సి., జడ్పిటిసీ సభ్యులకు ఒక్కొకరికీ పది తులాల చొప్పున బంగారు గొలుసులు పంచిపెట్టారని ఆరోపించారు.
ఆ ఆరోపణలను కాంగ్రెస్ మండల పరిషత్ అద్యక్షుడు రాము కిరణ్ ఖండించారు. రాజేశ్వరరెడ్డి చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాలు విసిరారు. ఆయన రుజువు చేయగలిగితే రాజగోపాల్ రెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.
ఇటువంటి సవాళ్లు ప్రతిసవాళ్ళు రాజకీయాలలో సర్వసాధారణమయిన విషయమే. కానీ ఒక ఎమ్మెల్సీ సీటు కోసం 139 స్విష్ట్ కార్లు, ఒక్కో మహిళా ఓటరుకి ఏకంగా 10 తులాల బంగారు గొలుసులు పంచిపెట్టడం నిజమయినట్లయితే ఎమ్మెల్సీగా ఎన్నికయితే ఎంత రాబడి ఉంటుందో…అని ఆలోచించవలసి ఉంటుంది. అంతకు పదింతలు ఆదాయం సంపాదించుకొనే అవకాశం లేకపోతే ఎమ్మెల్సీ సీటు కోసం అంత ఖర్చు ఎందుకు చేస్తారు? ఎమ్మెల్సీకే ఇంత ఆదాయం ఉంటే ఇక ఎంపీలు మంత్రుల ఆదాయం ఎంత ఉంటుంది అనేది ఊహించడం కూడా కష్టమేనేమో? అందుకే అందరూ ప్రజాసేవ చేయాలని తహతహలాడిపోతుంటారేమో?