హైదరాబాద్: హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంతలా వ్యవహరించబట్టే ఆయన పాలనలో అభివృద్ధి సాధ్యమయిందని, విజయాలు నమోదయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్గా టీడీపీ నేత పి.రంగనాయకులు నిన్న హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్టీఆర్కు లౌక్యం తెలియదని, ప్రజలపై నమ్మకం, ముక్కుసూటితనమే ఆయనను మహానేతగా నిలబెట్టిందని బాలయ్య అన్నారు. ఆయనకు రాజకీయలపై పట్టు లేదని కూడా వ్యాఖ్యానించారు. కేంద్రం ఇప్పుడు ఆహార భద్రత అంటోందని, కానీ ఎన్టీఆర్ అప్పుడే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పెట్టి ప్రజలకు ఆహార భద్రత కల్పించారని చెప్పారు. ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరేనని అన్నారు. టీడీపీ అంటే బీసీలు అని, టీడీపీకి బీసీలు గుండె చప్పుడని చెప్పారు. బీసీల కోసం ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని, రు.5 లక్షల వరకు రుణమివ్వాల్సి ఉందని అన్నారు. సంస్కృతంలో, తెలుగులో డైలాగులు చెప్పి అలరించారు. “నా పేరు చంద్రశేఖర వర్మ, నాలోని అహం పేరు డిక్టేటర్, నీ చావు చూడాలనుకుంటే దానిని టచ్ చేయ్” అంటూ తన తాజా చిత్రం డిక్టేటర్లోని డైలాగులు చెప్పారు. బాలకృష్ణ మాటలు చూస్తుంటే ఆయన ఉద్దేశ్యం చంద్రబాబు డిక్టేటర్లాగా వ్యవహరించలేకపోతున్నారనేనా అన్న సందేహం కలగక మానదు. బాలకృష్ణ తాజా చిత్రం పేరు కూడా డిక్టేటర్ కావటం గమనార్హం.