హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఇటీవల ఔట్లుక్ ఆంగ్ల మ్యాగజైన్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో హైకోర్ట్ ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. స్మితకు పరువునష్టం కలిగించారని ఆమె భర్త అకున్ సభర్వాల్ ఔట్లుక్ మ్యాగజైన్‌పై దాఖలు చేసిన ఈ కేసును హైకోర్ట్ కొట్టేసింది.
ఔట్లుక్ మ్యాగజైన్ ప్రతినిధులు ఇటీవల తమపై దాఖలైన కేసును కొట్టేయాలంటూ హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పైనే హైకోర్ట్ స్పందిస్తూ ఇవాళ్టి తీర్పును ఇచ్చింది. ఔట్లుక్ మ్యాగజైన్‌లోని ‘డీప్ థ్రోట్’ అనే కాలమ్‌లో ‘నో బోరింగ్ బాబు’ అనే శీర్షికతో తాతా మాధవి అనే జర్నలిస్ట్ స్మితా సభర్వాల్‌ను ఉద్దేశించినట్లుగా ఒక కథనాన్ని ఇచ్చారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా ఉన్న స్మిత మంచి మంచి చీరలు కడతారని, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమితురాలయ్యారని, అధికారులందరికీ ఇప్పుడు ఆమే ఆదేశాలిస్తున్నారని రాశారు. స్మిత వెస్ట్రన్ డ్రెస్ ధరించి ఒక ఫ్యాషన్ షోకు హాజరవటాన్ని కూడా దానిలో ప్రస్తావించారు. దీనిపైనే స్మిత భర్త కేసు వేశారు. సోషల్ మీడియాలో కూడా ఔట్ లుక్ మ్యాగజైన్‌పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి… స్మితా సభర్వాల్‌కు మద్దతు వచ్చింది. దీనితో ఔట్ లుక్ మ్యాగజైన్ విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన ఇచ్చింది. అయినా కేసు మాత్రం కొనసాగింది. తాతా మాధవిని సీసీఎస్ పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం స్మిత కోర్ట్ ఖర్చులకు రు.15 లక్షలు కూడా విడుదల చేసింది. ఇలా విడుదల చేయటంపై కోర్టులో మరో కేసు కూడా దాఖలయింది. మొత్తానికి అసలు కేసునే హైకోర్ట్ కొట్టేసింది.