హైదరాబాద్: 2011 జనాభా లెక్కలకు సంబంధించిన తాజా గణాంకాలు నిన్న విడుదలయ్యాయి. ఈ లెక్కల ప్రకారం బాల-బాలికల నిష్పత్తి 1000-918గా ఉంది. 2001 జనాభా లెక్కలలో ఈ నిష్పత్తి 1000-927గా ఉండగా, అది ఇప్పుడు మరింత తగ్గటం కలకలం సృష్టిస్తోంది. మగపిల్లలు కావాలనుకోవటం, చిన్న కుటుంబాలవైపు మొగ్గు చూపటం కారణాల వలన ఈ ప్రమాదకర పరిణామం జరిగిందని విశ్లేషిస్తున్నారు. జైన, సిక్కు మతాలలో మాత్రం 2001లోకంటే బాలికల సంఖ్య బాగానే పెరిగింది. ప్రతి 1000 మంది మగపిల్లలకుగానూ, 2001లో సిక్కు మతంలో 786 మంది ఆడపిల్లలు ఉంటే 2011లో ఆ సంఖ్య 828కి పెరిగింది. ఇక జైన మతంలో 2001లో ప్రతి 1000 మంది మగపిల్లలకు 870 మంది ఆడపిల్లలు ఉంటే ఆ సంఖ్య 2011కు 889కు పెరిగింది. దేశ జనాభాలో దాదాపు 80 శాతం ఉండే హిందూ మతంలో ప్రతి 1000 మంది మగపిల్లలకు 2001లో 925 మంది ఆడపిల్లలు ఉంటే 2011లో ఆ సంఖ్య 913కు పడిపోయింది. ఇప్పటికే హిందూ మతంలో అన్ని కులాలలో పెళ్ళీడుకొచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలు దొరకటం కష్టమైపోగా, ముందు ముందు పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారేటట్లు కనబడుతోంది… ఈ గణాంకాలు చూస్తుంటే. దానికి తోడు పెళ్ళిళ్ళు ఒక్కటే కాదని, స్త్రీలపై అత్యాచారాల సమస్య పెరగటానికి కూడా స్త్రీ పురుష నిష్పత్తిలోని వైరుధ్యాలే కారణమని చెబుతున్న సంగతి తెలిసిందే.