హైదరాబాద్: నందమూరి అభిమానులు నిట్టనిలువుగా చీలిపోయారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పెద్ద ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లే కనబడుతోంది. ఇప్పటివరకు అది కోల్డ్ వార్‌గానే ఉంది. అయితే విభేదాలు ముదురుతున్నాయి. ఆ అగ్ని జ్వాలల్లో సోషల్ మీడియా మరింత ఆజ్యం పోస్తోంది. దానికి తోడు ఇద్దరి సినిమాలూ సంక్రాంతికి పోటీ పడుతుండటంతో గతంలోని ప్రచ్ఛన్నయుద్ధం ఇప్పుడు పబ్లిక్ వార్‌గా మారేటట్లు కనిపిస్తోంది.
‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం కొత్త ఊహాగానాలకు తెర తీసింది. కార్యక్రమం మొత్తంలో బాలకృష్ణ పేరును ముగ్గురు నందమూరి నాయకులలో ఎవ్వరూ ప్రస్తావించకపోవటం, జూనియర్ ఎన్టీఆర్‌ను పెద్ద ఎన్టీఆర్ తన అంశగా చెప్పారంటూ వారసుడు తారకేనన్నట్లుగా హరికృష్ణ వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. కళ్యాణరామ్ తన తండ్రి గురించి మాట్లాడుతూ, 35 సంవత్సరాలపాటు ఎన్టీఆర్‌కు సేవలు చేశారని, సంపాదించుకునేవాళ్ళే(బాలకృష్ణ గురించా?) తప్ప అలాంటి కొడుకు మరెవరూ ఉండరని అనటం, ప్రసంగాన్ని ముగిస్తూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అనటం కూడా భిన్నంగా ధ్వనించింది.
నాన్నకు ప్రేమతో కార్యక్రమం ఎఫెక్టో, ఏమోగానీ గత వారంరోజులుగా జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. బాలయ్య తాజా చిత్రం ‘డిక్టేటర్’ పబ్లిసిటీలో నందమూరి ఏకైక నటవారసుడు నటించిన అని పేర్కొంటూ పోస్టర్లు పెట్టారు. పోస్ట్‌లు, కామెంట్స్కయితే లెక్కే లేదు.
“రాసి పెట్టుకోండి, ఇది నందమూరి నామ సంవత్సరం అనే జోక్‌తో ఎన్టీఆర్ ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు, పేర్లు చెప్పుకుని బతకటం ఏ రోజూ నేర్పలేదు మా నాన్న అనే జోక్‌తో అతను సంవత్సరాన్ని ముగిస్తున్నాడు”
“ఆ గుడివాడోడు నోటికొచ్చిన బూతులు తిడతాడు(కొడాలి నాని ఆ మధ్య బాలయ్యను అడ్డమైన తిట్లూ తిట్టాడు), నువ్వేమో కట్టె కాలేదాకా తెలుగుదేశం అంటావ్, మళ్ళీ వచ్చి లోకేష్ నా సినిమా ఆపాడు, బాలకృష్ణ డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేస్తున్నాడు, చంద్రబాబు సినిమా నిర్మాతలతో టెలీ కాన్ఫరెన్స్ చేసి నా సినిమా ఆపాడు అని ఏడుస్తావ్, నువ్వు తెలివిగలవాడినని అనుకుంటున్నావా, నువ్వు కూడా నీ స్నేహితుడు జగన్ టైపే, నీ ఖర్మ”
ఇక నందమూరి అభిమాని ఆవేదన పేరుతో మరో పోస్ట్ రౌండ్స్ కొడుతోంది. అసలు పెద్ద ఎన్టీఆర్‌కున్న అభిమాన బలాన్ని కాపాడుకుంటూ వచ్చింది బాలయ్యేనని, బాలయ్యే లేకపోతే జూనియర్, కళ్యాణరామ్లను పట్టించుకునే నాథుడే ఉండని, ఎస్వీఆర్ మనవడు హీరోగా వస్తే ఎంతమంది పట్టించుకున్నారని, బాలయ్య లేకపోతే ఎన్టీఆర్ మనవళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందని, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్లు బాలయ్య నామస్మరణ చేయబట్టే వాళ్ళను అభిమానించామని, ఇవాళ పదవులు దక్కపోయేసరికి వారు ఇలా వ్యవహరిస్తున్నారని, ఇన్నాళ్ళూ నందమూరి ఫ్యాన్స్‌గా ఉన్నామని, ఇకనుంచి బాలయ్య ఫ్యాన్స్‌గా మాత్రమే ఉంటామని, మళ్ళీ నందమూరి అభిమానులుగా మారాలంటే కళ్యాణరామ్, జూనియర్, హరికృష్ణ మారాలని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
2009 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. అతను ప్రచారం చేసిన చోట్ల టీడీపీకి విజయాలు లభించకపోయినా జూనియర్ తన ప్రచారంతో అందరినీ ఆకట్టుకున్నాడు. చంద్రబాబు తర్వాత రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆరే నందమూరి వారసుడవుతాడన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. దీనితో జూనియర్ తనను తాను ఎక్కువగా ఊహించేసుకున్నాడని, అటు లోకేష్‌లో అభద్రతా భావం మొదలయిందని అంటారు. అక్కడనుంచి విభేదాలు మొదలయ్యాయి. పార్టీలో కీలకమైన స్థానాన్ని ఆశించి భంగపడిన హరికృష్ణ, జూనియర్ పార్టీకి దూరంగా ఉండటం ప్రారంభించారు. జగన్‌తో టచ్‌లో ఉన్నారని, జూనియర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్ పార్టీ తరపున ఎన్నికల్లో నిలబలడారనే వాదన కూడా వినిపించింది. జూనియర్ సన్నిహితుడు కొడాలి నాని జగన్ పార్టీలో చేరారు. నాని అనుచరులు కొందరు పోస్టర్లు, బ్యానర్లలో జగన్, నానిలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టటంతో విభేదాలు ముదిరాయి. దానిపై బాలయ్య మీడియాముందు స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ దీనిని ఖండించాలని, లేకపోతే పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించగా, ఆ వ్యాఖ్యలపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తారక్ ప్రెస్ మీట్ పెట్టి ఆ పోస్టర్లు, బ్యానర్లతో తనకు సంబంధం లేదని, కట్టె కాలేదాకా తెలుగుదేశమేనని అన్నారు. అయినా అప్పుడు ఏర్పడిన వైషమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2013లో జరిగిన బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని వివాహానికి కూడా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఇదిలా ఉండగా, హరికృష్ణ సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకుని పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దీనివలన ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయంలో చంద్రబాబు పని మరింత సులువయ్యింది. 2014 ఎన్నికలలో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను హరికృష్ణ ఆశిస్తుండగా చంద్రబాబునాయుడు అప్పుడు దానిని తన వియ్యంకుడు బాలకృష్ణకు ఇచ్చేశారు. 2009 ఎన్నికలలో పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఈసారి ప్రచారంలో పాల్గొనలేదు. తన తండ్రికి టికెట్ ఇవ్వకపోవటంపై కినుక వహించటమే తారక్ ప్రచారంలో పాల్గొనకపోవటానికి కారణమని అనుకున్నారు. అటు పార్టీ కూడా హరికృష్ణనుగానీ, తారక్‌ను గానీ ప్రచారంలో ఇన్వాల్వ్ చేయలేదు. ప్రచారానికి సిద్ధమని తారక్ చెప్పినా కూడా అతనికి పార్టీనుంచి ఆహ్వానం రాలేదు. కావాలనే పార్టీ అతనిని దూరంగా పెట్టిందని అప్పట్లో అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదేమని మీడియా ప్రతినిధులు అడిగినపుడు, ఎవరినీ బొట్టు పెట్టి పిలవరని బాలయ్య, లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తారక్, కళ్యాణరామ్ హాజరైనప్పటికీ వారు అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. అప్పటినుంచి కూడా ఇరువర్గాలు కలిసిన సందర్భాలు లేవు. మధ్యలో 2014 ఆగస్టులో బాలయ్యకు చిన్న యాక్సిడెంట్ అయినపుడు, బాలయ్య బాబాయ్ బాగానే ఉన్నాడు ఆందోళన పడొద్దంటూ జూనియర్ ట్వీట్ చేయటమేగానీ బాలయ్యవైపు నుంచి ప్రతిస్పందనలేదు.
సినిమాల పరంగా కుమారుడు మోక్షజ్ఞకు, రాజకీయాలపరంగా అల్లుడు లోకేష్‌కు పోటీ అవుతాడనే ఉద్దేశ్యంతోనే బాలయ్య ప్రోత్సహించటంలేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. రామయ్యా వస్తావయ్యా వంటి జూనియర్ సినిమాలు బాగున్నా బాలయ్య అభిమానులు నెగెటివ్ టాక్ తీసుకొచ్చి ప్లాప్ చేశారని మండిపడుతున్నారు. బాలయ్య అభిమానులేమో – జూనియర్ ఎన్టీఆర్ 2014 ఎన్నికలకు ముందు జగన్‌తో సంబంధాలు పెట్టుకున్నాడని, కొడాలి నానికి టికెట్ ఇప్పించాడని, తన మామ ఛానల్ ‘స్టూడియో ఎన్’ ద్వారా టీడీపీపై దుష్ప్రచారం చేయించాడని ఆరోపిస్తున్నారు. కట్టె కాలేదాకా తెలుగుదేశంలో ఉంటానని జూనియర్ డైలాగులు చెప్పినా, పార్టీకి ద్రోహం చేయాలని తండ్రీ కొడుకులు ప్రయత్నించారని, చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని అంటున్నారు. ఆ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడని హరికృష్ణ, జూనియర్ ఊహించుకున్నారని, అయితే చంద్రబాబు గెలవటంతో తండ్రీకొడుకులు షాకయ్యారని చెబుతున్నారు. తన సినిమాలు ఆడకపోవటంతో జూనియర్ రాజీ ప్రయత్నాలు కూడా చేశాడని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఆరోపణలు – ప్రత్యారోపణల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణను ఎదిరించి నిలబడగలడా అనే చర్చ మొదలయింది. దీనిని రెండు కోణాలలో చూడాలి. ఒకటి సినిమాలు కాగా రెండోది రాజకీయాలు. సినిమాల పరంగా చూస్తే జూనియర్ సమర్థుడైన నటుడు. అతనికి ప్రతిభలో కొదవలేదు. ఇండస్ట్రీకి వచ్చిన నాటికీ, ఇప్పటికీ అతనిలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి. ఊర మాస్ పాత్రలకే పరిమితమని, వ్యక్తిగతంగా పొగరుగా ఉంటాడని మొదట్లో విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ విషయాలలో చాలా మారాడంటున్నారు. పాత్రల పరంగా కూడా వైవిధ్యాన్ని చూపించాలని తాపత్రయపడుతున్నాడు. నాన్నకు ప్రేమతో కూడా అలాంటి ప్రయత్నమే. ప్రతిభ ఉన్నవాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నది తెలిసిందే. ఇక రాజకీయాలపరంగా చూస్తే అది సినిమాలంత ఈజీ కాదు. పార్టీ అండలేకుండా అతను ఏమీ చేయలేడు. సొంతంగా పార్టీని పెట్టేటంత స్థాయి, వయస్సు ఇప్పుడైతే లేవు. భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి ప్రస్తుతానికి అతను రాజకీయాలకు దూరంగా ఉండటమే మేలు. జూనియర్ ఎన్టీఆర్ ఇకనైనా ఈ విభేదాలను, వివాదాలను పక్కనపెట్టి క్రమశిక్షణతో సినిమాలపైనే దృష్టిపెట్టి కృషిచేస్తే అతను ఉన్నతస్థానాలకు చేరుకోకుండా ఏ శక్తీ ఆపలేదు!