తెలంగాణా రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు గురువారం ప్రజల ముందు బహిరంగంగా వాగ్వాదానికి దిగి ఒకరినొకరు తోసుకొన్నారు. లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినపుడు వారివురు మధ్య ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల విషయంలో వాగ్వాదానికి దిగి ఒకరినొకరు తోసుకొన్నారు. దాంతో ఇరువురు నేతల అనుచరులు కూడా ఘర్షణకు దిగారు. ఆ తరువాత ఇరు వర్గాలు నిరసనగా రోడ్డు మీద బైటాయించడంతో ట్రాఫిక్ కి చాలా అంతరాయం కలిగింది. పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించవలసి వచ్చింది. అధికారపార్టీకి చెందిన ఒక మంత్రి, ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శంగా మెలుగుతారని అందరూ ఆశిస్తారు. కానీ వారిలో వారే గొడవపడి, రోడ్డు మీద బైటాయించి మధ్యలో ప్రజలకు ఇబ్బంది కలిగించడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. బహుశః వారి ఈ పంచాయితీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళుతుందేమో?