నూతన సంవత్సరం ఆరంభం (జనవరి 1) నుంచే తమిళనాడులోని హిందూ ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. మద్రాసు హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలమేరకు ప్రభుత్వ అధికారులు భక్తుల డ్రెస్ కోడ్ అమలుపై శ్రద్ధపెట్టారు. భక్తులకు అవగాహన కలిగించడం కోసం అనేక ఆలయాల వద్ద డ్రెస్ కోడ్ కి సంబంధించిన నోటీసులను కొద్దిరోజుల క్రితమే అంటించారు.
పళని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం ముంగిట డ్రెస్ కోడ్ కి సంబంధించిన నోటీసులను డిసెంబర్ చివరి వారంలోనే అంటించారు. ఈ క్షేత్రం దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం భక్తులు భావిస్తుంటారు. రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఇలాంటి క్షేత్రాల్లో సాంప్రదాయ దుస్తులు వేసుకునే దర్శనం చేసుకోవాలని చాలాకాలం నుంచి చెబుతున్నప్పటికీ, అధికారికంగా దీన్ని అమలుచేయడం కుదరలేదు. ఇప్పుడు హైకోర్ట్ ఆదేశంతో మార్గం సుగమం అయిందని అక్కడి అర్చక స్వాములు చెబుతున్నారు.
ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ఆలయంలోకి ప్రవేశించే వారు లంగీలు, బెర్మడాస్, జీన్లు, టైట్ లెగ్గింగ్స్ వంటివి ధరించకూడదు. పురుషులు ధోవతీ, షర్ట్ లేదా ఫైజమా కుర్తా, ప్యాంట్ షర్ట్ ధరించి దర్శనం చేసుకోవాలి. ఇక మహిళలు, అమ్మాయిలు చీరలు, చురిదార్ లేదా లంగాఓణిలు ధరించి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇక పిల్లలు కూడా పూర్తిగా కవరయ్యే దుస్తులు మాత్రమే వేసుకుని ఆలయాల్లోకి వెళ్ళాలి.
తమిళనాడులోని మిగతా ముఖ్యమైన ఆలయాల్లో కూడా ఇదే తరహా నిబంధనలను అమలుచేస్తున్నారు. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధి చెందిన రామేశ్వరం, మీనాక్షి ఆలయాల్లో కూడా అధికారులుఇదేతరహా నోటీసులు అటించినట్లు తెలిసింది. ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచడంకోసం భక్తులు డ్రెస్ కోడ్ పాటించాల్సిందేననీ, రాష్ట్రంలోని హిందూ మత, ధార్మిక సంస్థలు, దేవాదాయ-ధర్మాదాయ శాఖ అమలుచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం జనవరి 1 నుంచి ప్రముఖ ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలుచేయడం మొదలెట్టింది.
ఈమధ్య ఆలయాల దర్శనకు వెళ్లేవారు సాంప్రదాయ దుస్తులను వేసుకోవడం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండటంతో మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి ఎస్ . వైద్యనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు ఇష్టానుసారంగా డ్రెస్ వేసుకుని రావడం బాధాకరమన్న భావన చాలాకాలంగా ఉంది. కురచ దుస్తులు వేసుకుని హిందూ ఆలయాలకు వెళ్లడం పట్ల హిందూ సంస్థలు చాలాకాలంగా తప్పుబడుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఒకే తరహా డ్రెస్ కోడ్ ఉంచాలన్న వాదన ఈనాటిది కాదు. ఇప్పటికి మద్రాస్ హైకోర్ట్ జోక్యం చేసుకుని డ్రెస్ కోడ్ విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. పురుషులు నిక్కర్లు , లుంగీలతోనూ, మహిళలు శరీర ఆకృతి కనిపించేలా టైట్ దుస్తులు, లేదా కురచ దుస్తులు వేసుకుని ఆలయాలకు రావడం ఇక కుదరదు.
ఇలాంటి నిబంధనలనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని హిందూమత సంస్థలు కోరుతున్నాయి.