అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమిళ తంబీ శింబుకి.. మూలిగే నక్క మీద గుమ్మడికాయ లాగా వచ్చిపడింది బీప్ సాంగ్ వ్యవహారం. ఏదో సరదాగా రాసి, పాడిన పాటతో తమిళనాట దుమారం రేపింది. అమ్మ ముఖ్యమంత్రిగా పాలిస్తున్న రాష్ట్రంలో స్త్రీలను ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ శివమెత్తారు మహిళలు.
బీప్ సాంగ్ మీద మహిళా సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేయడం.. దాని మీద పోలీసులు కేసులు పెట్టడం,, అరెస్ట్ వారెంట్ లు… అంటూ హడావిడి బాగానే జరిగింది. అయితే.. ఇందులో కొందరు రాజకీయ నాయకులు కూడా శింబుకి వ్యతిరేకంగా కేసులు పెట్టడంతో బీప్ లో పడ్డ ఎలకలా తయారైంది శింబు దుస్థితి. అందుకే.. చాలా రోజులుగా తమిళనాడులో ఎవరికి కనిపించకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయాడు. వాడిని కన్నందుకు నన్ను చంపేయండి అంటూ శింబు తల్లి సెంటిమెంట్ టచ్ ఇవ్వడంతో కేసు మరింత రసకందాయంలో పడింది.
కానీ.. 2016 సంవత్సరం శింబుకి కలిసొస్తున్నట్టు కనిపిస్తోంది. బీప్ సాంగ్ వ్యవహారంలో ఈ తమిళ తంబీ మీద కేసు పెట్టిన కొందరు రాజకీయ నాయకులు తమ కేసులను వెనక్కి తీసుకుంటున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన నాయకుడు కేసు విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో శింబుకి సగం టెన్షన్ తీరినట్టయింది. ఇక మిగిలిన విషయాలన్నీ తేలడానికి మరో మూడు రోజులు టైమ్ ఉంది. ఈనెల 4న బెయిల్ పిటీషన్ విచారణలో హాజరయ్యేందుకు కోర్టుకు వస్తున్నాడు యువనటుడు. ఏకంగా అధికార పార్టీ నేతలే కేసు విత్ డ్రా చేసుకోవడాన్ని బట్టి చూస్తుంటే.. శింబుకి 2016లో నిజంగా హ్యాపీ న్యూఇయర్ అనుకోవచ్చేమో.!