నిన్నటి పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీ ఇప్పుడు భారతీయుడు. మానవత్వంతో భారత ప్రభుత్వం అతడికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. సహనానికి మారుపేరైన మన దేశంలో మరో మానవీయ ఘటన ఇది. ఇప్పుడు అవార్డు వాపసీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బీహార్ ఎన్నికలు పూర్తయి మరుక్షణం అసహనంపై చర్చ ఎందుకు ఆగిపోయింది? అద్నాన్ సమీకి పౌరసత్వం ఇవ్వడం సహనానికి నిదర్శనం కాదా అనే చర్చ మొదలైంది.
జై హింద్. తనకు భారతీయ పౌరసత్వం రాగానే అద్నాన్ సమీ ఆనందంతో చేసిన ట్వీట్ ఇది. భారతీయుడిగా పౌరసత్వం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు నుంచి పౌరసత్వ సర్టిఫికెట్ అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు పునర్జన్మ అని వ్యాఖ్యానించారు.
అద్నాన్ సమీ గాయకుడిగా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. పద్నాలుగేళ్ల క్రితం విజిటింగ్ వీసాతో భారతీయ గడ్డపై అడుగుపెట్టిన సమీ, తన గానంతో ఎంతో మందికి చేరువయ్యాడు. అప్పట్లో ఊబకాయంలో బాధపడేవాదు. తర్వాతి కాలంలో 230 కిలోల నుంచి 75 కిలోలకు బరువు తగ్గాడు. మానవతా దృక్పథంతో తనకు భారతీయ పౌసత్వం ఇవ్వాలని అతడు చేసిన దరఖాస్తుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.
భారత దేశంలో అసహనం అనేదే లేదని సమీ చెప్పాడు. అదే ఉంటే గనక, పాకిస్తానీ అయిన తనకు భారత్ పౌరసత్వం రాదన్నాడు. ఇప్పుడు అవార్డ్ వాపసీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. దాద్రీ ఘటన, ఇతర సంఘనత తర్వాత అకాడమీ అవార్డులను ఇతర పురస్కారాలను చాలా మంది వాపస్ ఇచ్చారు. బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీమీద విపక్ష నేతలు, అవార్డ్ వాపసీ మేధావులు దుమ్మెత్తి పోశారు. ఆ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం అసహనం చర్చ మటుమాయమైంది. ఇది పెద్ద కుట్ర అన్న బీజేపీ వ్యాఖ్య నిజమే అనే విధంగా అవార్డ్ వాపసీ వ్యవహారం సాగింది. ఇప్పుడు అద్నాన్ సమీకి పౌరసత్వం తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో చాలా మంది అవార్డ్ వాపసీ మేధావులను ప్రశ్నిస్తున్నారు. భారత్ సహనానికి ప్రతీక అని ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి వారు ఎలా స్పందిస్తారో చూద్దాం.