ఈరోజు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి జరుగగానే అక్కడ జరిగిన పరిణామాల కంటే ఆ దాడి ప్రభావం భారత్-పాక్ సంబంధాలను మళ్ళీ దెబ్బ తీస్తుందా? అనే అనుమానం దేశప్రజలందరిలో కలిగితే అసహజమేమీ కాదు. భారత్-పాక్ మధ్య చిగురించిన సహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టేందుకే ఉగ్రవాదులు ఈ పనికి పూనుకొని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సరిహద్దులలో ఇరుదేశాల సైనికులకి మధ్య కాల్పులు జరుగడం లేదా భద్రతాదళాలలకి ఉగ్రవాదులకి మధ్య కాల్పులు జరగడానికి, ఈ దాడికి చాలా తేడా ఉంది. ఉగ్రవాదులు భారత వాయుసేన స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి దిగడాన్ని భారత ప్రభుత్వం చాలా గంభీరమయిన విషయంగా పరిగణిస్తోంది. అలాగే ఇటీవల వాయుసేన, సరిహద్దు భద్రతాదళాలలో వరుసగా పట్టుబడుతున్న కొందరు వ్యక్తులు, పాకిస్తాన్ గూడచర్య సంస్థ ఐ.ఎస్.ఐ. మన దేశంలో గూడచర్యానికి పాల్పడుతోందనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. ఈ నేపద్యంలో భారత్-పాకిస్తాన్ స్నేహ సంబంధాలను కొనసాగించగలవా లేదా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఉగ్రవాద దాడిని భారత్ లో ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించడం సహజమే. కానీ దీనిపై భారత్ స్పందన కంటే పాక్ ఏవిధంగా స్పందిస్తుందనేదే చాలా ముఖ్యం. కనుక పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని ఖండిస్తూ ప్రకటన చేస్తుందని అందరూ ఆశించడం సహజమే. ఈ ఉగ్రవాదుల దాడితో పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి ఎటువంటి సంబంధమూ లేదని భావించినపట్టికీ, ఆ దేశ ఐ.ఎస్.ఐ. సంస్థ భారత్ లో నెరుపుతున్న గూడచర్యం దానిపై అనుమానాలు కలిగించేలా చేస్తోంది. ఒకవేళ భారత్ తో బలమయిన స్నేహసంబంధాలు అది కోరుకొంటునట్లయితే తక్షణమే అది తన గూడచర్య కార్యకలాపాలను నిలిపివేయవలసి ఉంటుంది. అలాగే పాకిస్తాన్ లో తిష్టవేసి భారత్ పై ఇటువంటి దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదమూకలను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయవలసి ఉంటుంది.
ఏదో మొక్కుబడిగా చర్చలకి కూర్చోవడం కంటే అటువంటి చర్యల ద్వారానే తన చిత్తశుద్ధిని బయటపెట్టుకోవచ్చును. తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటి సంబంధాలను చిరకాలం నెరపడం వలన ఇరు దేశాలకి ఎటువంటి ప్రయోజనం పొందలేవు. కనుక సంబంధాలు బలపరుచుకోవడానికి రెండు దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. బహుశః ఈరోజు జరిగిన దాడి కారణంగా మోడీ ప్రభుత్వం పాక్ పట్ల తన వైఖరిని మళ్ళీ మార్చుకొంటుందని అనుకోలేము.భారత్-పాక్ దేశాలకు ఇది తీవ్రవాదులు పెట్టిన మొదటి పరీక్షగానే స్వీకరించి, పాకిస్తాన్ తో శాంతి చర్చలు కొనసాగించవచ్చును. అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తన వంతు కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇటువంటి అగ్నిపరీక్షలను సమర్ధంగా ఎదుర్కోగలవు.