రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికలలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తన ఉనికిని కూడా కోల్పోసాగింది. రాష్ట్రంలో పార్టీని కాపాడుకొనేందుకే ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమాలు చేపట్టింది. ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల కోసమే పోరాడుతున్నానని నమ్మించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరూ దాని మాటలను నమ్మలేదు. పోరాటాలను పట్టించుకోలేదు. అలాగని ఏ హడావుడి చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొంటే పార్టీ కనబడకుండాపోయే ప్రమాదం ఉంది కనుక ప్రత్యేక హోదా కోసం ‘మట్టి సత్యాగ్రహం’ మొదలుపెట్టింది.
అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడి వచ్చినప్పుడు కనీసం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ అయినా ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన డిల్లీ నుంచి చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అందుకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ‘మట్టి సత్యాగ్రహం’ కార్యక్రమం చేపట్టింది.రాష్ట్రంలో అన్ని గ్రామాల నుంచి మట్టి, నీళ్ళు సేకరించి మోడీకి పంపించింది.
కానీ ఆ కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి స్పందన కరువవడంతో అది అసలు ఎప్పుడు మొదలయిందో ఎప్పుడు ముగిసిపోయిందో ఎవరికీ తెలియకుండా అయిపోయింది. మొన్న బుధవారంనాడు పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా అయిన చిత్తూరులోని చంద్రగిరిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు.
ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఎన్నికలలో గెలిచిన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసారు. కేంద్రప్రభుత్వం మోసం చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని గట్టిగా నిలదీసి అడగకుండా తన పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నోరు మెదపడం లేదు. తెదేపా ప్రభుత్వం మౌనం వహించినప్పటికీ ప్రత్యేక హోదా సాధించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాము,” అని అన్నారు.
జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంచుమించు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయిన తరువాత ఇప్పుడు ఆయన కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మానుకొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలను మభ్యపెట్టాయనే ప్రతిపక్షాల ఆరోపణలలో అసత్యమేమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అందుకు ఏమాత్రం తీసిపోని మంచి ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ప్రకటించారు. ఆయన ఆ మాట చెప్పి ఆరు నెలలయింది. ఇంతవరకు ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారు. కేంద్రప్రభుత్వం తన హామీలని నిలబెట్టుకోకపోయినా, రఘువీరా రెడ్డి చెప్పిన కారణాల చేత రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీసి అడగటం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చిత్తశుద్ది లేదు. అధికారపార్టీకి ఆసక్తి లేదు. అందుకే కేంద్రప్రభుత్వం కూడా హామీల అమలు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు..