వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో ఆమె, వైకాపా కూడా వరుసగా తప్పటడుగులు వేసి గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకొంటే, తెదేపా కూడా అధికార పార్టీ అనే అహం ప్రదర్శించి చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేసుకొని విమర్శలు మూటగట్టుకొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల రోజా సభలో అనుచితంగా మాట్లాడటం చాలా తప్పు. ఆ తప్పును సమర్ధించుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఎడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసినా అందుకు తను బాధపడటం లేదని చెప్పడం ఇంకో తప్పు. తన తప్పుని ఒప్పుకొని, స్పీకర్ ని క్షమాపణలు కోరి ఈ సమస్య నుండి బయటపడే అవకాశాన్ని కాలదన్నుకోవడం ఇంకా తప్పు. సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని చెప్పి మళ్ళీ మర్నాడు అసెంబ్లీకి వచ్చి రాద్దాంతం చేయడం ఇంకో తప్పు. తన తప్పుని అంగీకరించి అధికార పార్టీ సభ్యలు, ప్రజల ముందు చులకన అవడం కంటే ఎదురుదాడి చేసి అధికార పార్టీదే తప్పు అని నిరూపించాలనుకొన్న వైకాపా వ్యూహాత్మకంగా మరో పెద్ద తప్పు చేసింది. వరుసపెట్టి ఇన్ని తప్పులు చేసిన తరువాత ఈ సమస్య నుండి ఏవిధంగా బయటపడాలో వైకాపాకి కూడా అర్ధం కావడం లేదేమో?
ఇక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పట్ల సభలో అనుచితంగా మాట్లాడితే అందుకు తప్పకుండా శిక్షించవచ్చును. కానీ ముందూ వెనుకా ఆలోచించకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించేయడం తప్పు. దాని వలన అంతవరకు ఆత్మరక్షణలో పడిన వైకాపాకు ఎదురుదాడి చేసే అవకాశాన్ని అధికార పార్టీయే కల్పించిందని చెప్పవచ్చును. ఆమెపై తగిన క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి తక్షణమే ఒక కమిటీని నియమించి ఉండి ఉంటే, వైకాపా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది.
బహుశః తెదేపా తన పొరపాటును గ్రహించినందునే ఇప్పుడు నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించినట్లు భావించవచ్చును. బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెదేపా తరపున ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, బీజేపీ తరపున విష్ణు కుమార్ రాజు, వైకాపా తరపున శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. నలుగురిలో ఒక్క శ్రీకాంత్ రెడ్డి తప్ప మిగిలిన ముగ్గురు కూడా స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధించడం తధ్యం. అంటే శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా స్పీకర్ తీసుకొన్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టడానికి వీలులేకుండా ఉండేందుకే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు అర్ధం అవుతోంది. కనుక రోజాని ఏడాది పాటు సస్పెండ్ చేయడం కూడా తధ్యమని భావించవచ్చును.
తెదేపా చేసిన తప్పును వైకాపా ఎత్తి చూపించడంతో అది మేల్కొని దానిని సవరించుకొని కమిటీ వేసి ‘మమ’ అనిపించేసేందుకు సిద్దం అయ్యింది. కనుక ఇప్పటికయినా వైకాపా కూడా మేల్కొని తన తప్పును అంగీకరించి ఈ కమిటీ ద్వారానే రోజాపై సస్పెన్షన్ వేటు తొలగించుకొనే ప్రయత్నం చేయడం అన్ని విధాల మంచిది. లేకుంటే అదే నష్టపోతుంది తప్ప తెదేపా కాదని గ్రహించాలి.