హైదరాబాద్: ‘అలా మొదలయింది’ చిత్రంతో సినీరంగ ప్రయాణాన్ని విజయవంతంగా మొదలుపెట్టిన దర్శకురాలు నందినిరెడ్డి తాజాగా దర్శకత్వం వహించిన ‘కళ్యాణవైభోగమే’ చిత్రం ఆడియో నిన్న అట్టహాసంగా విడుదలయింది. అలా మొదలయింది ద్వారా నందినికి తొలి అవకాశం ఇచ్చిన కేఎల్ దామోదర్ ప్రసాదే ఈ చిత్రానికి కూడా నిర్మాత. నాగశౌర్య హీరో కాగా, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో నటించిన మళయాళ కుట్టి మాళవికా నాయర్ హీరోయిన్. అలనాటి హీరోయిన్ రాశి ఈ చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించటం విశేషం. కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందించారు.
నందినిరెడ్డి ఇప్పటివరకు ‘అలా మొదలయింది’, ‘జబర్దస్త్’ అనే రెండు సినిమాలు రూపొందించగా, ‘కళ్యాణ వైభోగమే’ మూడవది. ఈ మూడు సినిమాలు గమనిస్తే పెళ్ళే కథలో కీలకం కావటం చూడొచ్చు. ‘అలా మొదలైంది’లో నిత్యమీనన్ మరొకరిని పెళ్ళి చేసుకోబోతుండగా, నాని అక్కడకు వెళ్ళటం, అక్కడ జరిగే గొడవ, హడావుడి అంతా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ‘జబర్దస్త్’ చిత్రాన్ని నందిని బాలీవుడ్ చిత్రం ‘బ్యాండ్ బాజా బారాత్’కు అనధికార కాపీగా తీశారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్(సిద్దార్థ, సమంత) వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని నడుపుతుంటారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఆ చిత్రం ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ బాగోకపోవటంతో ఫ్లాప్ అయింది. ఇక మూడో ప్రయత్నం పేరే కళ్యాణ వైభోగమే. మొత్తానికి నందిని రెడ్డి తాను పెళ్ళి చేసుకోకపోయినా పెళ్ళి సబ్జెక్టు మీద వరసపెట్టి సినిమాలు చేస్తుండటం విచిత్రంగా ఉంది!