తెలంగాణా రాజకీయాలలో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెదేపా, బీజేపీలను గెలిపించుకోవడానికి మళ్ళీ కలుగజేసుకోక తప్పేలాలేదు.ఈ నెల ఏడవ తేదీన ఆ రెండు పార్టీలు కలిపి హైదరాబాద్ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాయి. అందులో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నట్లు జూబిలీ హిల్స్ తెదేపా ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ తెలిపారు. ఈ ఎన్నికలలో తెదేపా, బీజేపీలు కలిసి పోటీ చేయబోతున్నందున, ఏ డివిజన్లలో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే విషయంపై చర్చించేందుకు తెదేపా తరపున ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెదేపా, బీజేపీ సీనియర్ నేతలతో కూడిన ఒక సమన్వయ కమిటీ దీనిపై చర్చించి అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తుందని చెప్పారు.
ఓటుకి నోటు, టెలీఫోన్ ట్యాపింగ్ కేసుల తరువాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి విజయవాడకు తరలివెళ్లిపోయారు. ఆ తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సఖ్యత ఏర్పడినప్పటి నుండి, ఆ సహృద్భావా వాతావరణం కొనసాగేందుకు తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కోసం హైదరాబాద్ లో జరుగబోయే బహిరంగ సభలో పాల్గొంటే తెలంగాణా ప్రభుత్వంపై, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయక తప్పదు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆయన విమర్శలు చేయవలసి వచ్చినప్పటికీ దాని వలన మళ్ళీ ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు కలగవచ్చును. ఒకవేళ చంద్రబాబు నాయుడు తమ సఖ్యతకు భంగం కలగకూడదని భావించి, తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈ బహిరంగసభలో విమర్శలు చేయదలచుకోకపోతే ఆయన ఆ సభకు హాజరయినా ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. ఆయన మౌనం వహించినా ఆ సభలో పాల్గొనే మిగిలిన అందరూ తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడం తధ్యం. కనుక వారికి ఆయన ఆమోదం ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది. అప్పుడు కూడా ఇరువురు ముఖ్యమంత్రులు మధ్య మళ్ళీ విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్లే భావించవచ్చును.