బిహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆర్.జె.డి. ప్రధాన భాగస్వామిగా ఉంది. దాని అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కొడుకులు మంత్రులుగా ఉన్నారు. కనుక లాలూ ప్రసాద్ యాదవ్ మెల్లిగా తన విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టారు. బిహార్ లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శలు గుప్పించిన తరువాత, ఎవరికయినా పోలీసులు న్యాయం చేయకపోతే తనని నేరుగా కాంటాక్ట్ చేయవచ్చని ప్రకటించేరు.
లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లో ఆకస్మిక తణికీలు నిర్వహించారు. అక్కడి నుంచే వైద్య, ఆరోగ్యశాఖా మంత్రిగా చేస్తున్న తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కి ఫోన్ చేసి ఆసుపత్రి నిర్వహణ ఏమాత్రం బాగోలేదని, అపుడపుడు ఆకస్మిక తణికీలు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చేరు. తను స్వయంగా అధికారంలో లేకపోయినా ఎవరినయినా గడగడలాడించగలనని చాటిచెప్పుకొన్నట్లయింది. కానీ తను ఆ మార్గం గుండా వెళుతూ జస్ట్ ఒకసారి ఆసుపత్రి ఏవిధంగా ఉందో చూసిపోవాలని వచ్చేనని చెప్పడం విశేషం. లాలూ ప్రసాద్ యాదవ్ అనధికారంగా ఆసుపత్రిలో తణికీలు నిర్వహించినప్పటికీ నితీష్ కుమార్ ప్రభుత్వం స్పందించలేదు. స్పందిస్తే ఏమవుతుందో నితీష్ కుమార్ బాగా తెలుసు.