హైదరాబాద్: విలక్షణ నటుడు మోహన్‌బాబు అంటే టాలీవుడ్‌లో అందరికీ హడలేనన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి మోహన్‌బాబునే గేదె అని సంబోధించారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇటీవల ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆహార అలవాట్ల గురించి వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోహన్ బాబు ఆహార అలవాట్ల గురించి ప్రస్తావించారు. మోహన్ బాబుతో షూటింగ్‌లో ఉన్నపుడు ఆయన ఏదో ఒక ఆహారపదార్థాన్ని ఆఫర్ చేస్తూనే ఉంటారని అన్నారు. ఒకసారి ఆమ్లెట్ అని, ఒకసారి స్వీట్ అని, మరోసారి బిర్యాని అని ఏదో ఒకటి ఆఫర్ చేస్తుంటారని, వాటిని గురించి వర్ణిస్తూ ఉంటారని చెప్పారు. ప్రతి 15-20 నిమిషాలకొకసారి ఏదో ఒకటి పెడుతూ ఉంటారని అన్నారు. ఒకరోజు తాను, “గేదెలు, మేకలు ఎప్పుడూ తింటూ ఉంటాయండి, సింహం ఒకేసారి తింటుందండి” అని చెప్పినట్లు తెలిపారు. ఆ మాటలతో ఆయన షాక్ అయ్యారని చెప్పారు. “నేను ఎప్పుడూ నిలబడే ఉంటాను, మీరు ఎప్పుడూ కూర్చునే ఉంటారు, నాకు ఎప్పుడూ అలసటగానీ, అనారోగ్యంగానీ ఉండవు, మీకు మాత్రం అవన్నీ ఉంటాయి” అని అన్నట్లు వెల్లడించారు. “మీరు గేదెలాగా ఎప్పుడూ తింటూ ఉండటం వల్లే ఇలా జరుగుతోంది” అని చెప్పినట్లు తెలిపారు. రుచికోసం తినగూడదని, అది ఆల్కహాల్ కంటే కూడా చాలా దారుణమైన అలవాటని చెప్పారు. జీవించటంకోసం తినాలి తప్పితే తినటంకోసం తినగూడదని వర్మ అన్నారు.