హైదరాబాద్: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న తెలుగు విద్యార్థులు పలువురు ఆ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్‌తోనే వారు ఇలా చేస్తున్నారని తెలిసింది. స్టూడెంట్ వీసాలపై వెళ్ళిన విద్యార్థులు, తాము అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తామని చెబుతుండటంతో ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి పంపేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో తమ వీసాలకు కూడా ముప్పు వస్తుందనే భయంతో ఇప్పటికే అక్కడ ఉంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్యాస్ స్టేషన్లు(పెట్రోల్ బంకులు), సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో మన విద్యార్థులు గంటకు 5-6 డాలర్ల జీతానికి పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తుంటారు. ఇప్పుడు వాటన్నింటినీ వదిలేస్తున్నారు. డీపోర్టేషన్ భయంతో యూనివర్సిటీ లెటర్స్, తమ ఆర్థిక వివరాలు, ఇతర కీలక పత్రాలన్నింటినీ దగ్గర పెట్టుకుని తిరుగుతున్నారు. అయితే ఇటీవల అమెరికా అధికారులు మాత్రం పార్ట్ టైమ్ జాబ్స్ చేసే విద్యార్థులపై కన్నేసి ఉంచారని, ఇటీవల ఒక విద్యార్థి అలాంటి పార్ట్ టైమ్ జాబ్‌కు రాజీనామా చేసిన తర్వాత కూడా అతను చేసిన జాబ్ వివరాలన్నింటినీ పట్టుకుని అతనిని పంపించేశారని తెలిసింది. అమెరికాలోని చాలా యూనివర్సిటీలు విద్యార్థులు అక్రమంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నా పట్టించుకునేవి కావని, అయితే ప్యారిస్‌లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడి తర్వాత అమెరికా అధికారులు నిబంధనలను కఠినతరం చేశారని చెబుతున్నారు. విద్యార్థులను ఇకనుంచి ఎక్కడపడితే అక్కడకు ఫ్రీగా తిరగనీయగూడదని అధికారులు నిర్ణయించారని, విద్యార్థులను బాగా స్క్రూటినీ చేస్తున్నారని, యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థుల అటెండెన్స్‌ను కూడా తనిఖీ చేస్తున్నారని అంటున్నారు.