కల్తీ మద్యం కేసులో తొమ్మిదవ నిందితుడిగా పేర్కొనబడిన కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు గత మూడు వారాలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఆయనను పట్టుకోవడానికి రెండు పోలీస్ బృందాలు హైదరాబాద్ , భువనేశ్వర్ వెళ్ళాయి కానీ ఆయన ఆచూకి కనిపెట్టలేకపోయాయి. ఆయన కొన్ని రోజుల క్రితం తన లాయర్ల ద్వారా విజయవాడ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చేయి. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన సన్నిహితులకు, లాయర్లకు ఖచ్చితంగా తెలిసే ఉంటుందని స్పష్టం అవుతోంది. కనుక కోర్టు కూడా లాయర్ల ద్వారానే ఆయనకు ఒక సందేశం పంపినట్లు తెలుస్తోంది. మూడు రోజులలోగా పోలీసులకు లొంగిపోవాలని లేకుంటే తీవ్రమయిన చర్యలు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. మరి ఇప్పటికయినా మల్లాది విష్ణు లొంగిపోతారో లేక ఇంకా తన దాగుడు మూతల కార్యక్రమం కొనసాగిస్తారో చూడాలి.