హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) విధివిధానాలపై సుప్రీంకోర్ట్ నియమించిన జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ ఇవాళ తన నివేదికను సుప్రీం కోర్టుకు, బీసీసీఐకు సమర్పించింది. కొన్ని కీలకమైన ప్రతిపాదనలతోపాటు, సలహాలు, సూచనలను ఈ నివేదికలో పొందుపరిచింది. బీసీసీఐలో మంత్రులు, ప్రభుత్వాధికారులు ఉండగూడదని సూచించింది. రాష్ట్రానికి ఒక్కరికి ఓటింగ్ హక్కుతో సహా ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది. ఐపీఎల్ మాజీ సీఓఓ సుందర్ రామన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. బీసీసీఐని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. బీసీసీఐ, ఐపీఎల్‌కు వేర్వేరు పాలనా మండలులు ఉండాలని పేర్కొంది. క్రికెటర్ల వాణిని వినిపించటానికి ఒక సంఘం ఉండాలని సూచించింది. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని సలహా ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడెవరూ రెండుకంటే ఎక్కువ పర్యాయాలు ఆ పదవిలో పనిచేయగూడదని ప్రతిపాదించింది. గత ఏడాది లోధా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ళపాటు సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.