భారత షేర్ మార్కెట్ మరో `బ్లాక్ మండే’ని చవిచూసింది. చైనా మార్కెట్ అతలాకుతలం అవడంతో దాని ప్రభావం మన షేర్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో మరో బ్లాక్ మండేని చవిచూడాల్సి వచ్చింది. సెన్సెక్స్ 537, నిఫ్టీ 171 పాయింట్లకు పైగా పతనం చూడాల్సివచ్చింది. ఈ పరిస్థితి ఎలా వచ్చింది ? మెరుగుపడే అవకాశాలు లేవా?
మన షేర్ మార్కెట్ లో `బీఎస్ ఈ’ సెన్సెక్స్ సూచిక ఈమధ్య కాలంలో పుంజుకుందనే చెప్పాలి. అయితే చాలా వారాల తర్వత సోమవారంనాడు ఉన్నట్టుండి 550 పాయింట్ల మేరకు దిగజారడం ఓ షాక్. అదే బాటలో నిఫ్టీ సూచిక కూడా పతనమైంది. నిఫ్టీ 160 పాయింట్ల మేరకు డీలా పడింది. అయితే సోమవారం ట్రేడ్ ముగిసే సమయానికి కొంత ఊపిరి పీల్చుకుని చివరకు సెన్సెక్స్ 537 వద్ద, నిఫ్టీ 171 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించుకున్నాయి.
మన షేర్ మార్కెట్ పతనాలు చవిచూడాల్సి రావడం, మరో బ్లాక్ మండేగా చెప్పుకునే పరిస్థితికి ప్రధాన కారణం పొరుగుదేశమైన చైనాలోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలడమే. అంతర్జాతీయ షేర్ మార్కెట్ల ప్రభావాలను అంతగా పట్టించుకోనివారికి ఇదంతా పెద్ద చిక్కుముడిగా కనిపించవచ్చు. చైనాలో షేర్ మార్కెట్ పతనమైతే ఇక్కడ భారత్ లో సెన్సెక్స్, నిఫ్టీ బావురమనడమేమిటన్న సందేహం కలగొచ్చు.
చైనాలో షాంఘై స్టాక్ సూచీ (సీఎస్ఐ 300) ఈ కొత్త సంవత్సరానికి (2016) ట్రేడింగ్ మొదటిరోజునే 5శాతం పడిపోయేసరికి నిబంధన ప్రకారం తాత్కాలికంగా 15 నిమిషాలపాటు ట్రేడింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఈ పతనం అక్కడితో ఆగలేదు. 5 శాతం కాస్తా మరికాసేపటికి 7శాతం అవడంతో రోజంతా వాణిజ్యాన్ని రద్దుచేయాల్సివచ్చింది. చైనా స్టాక్ మార్కెట్ విధివిధానాల ప్రకారం ఇదంతా జరిగింది. అయితే చైన్ రియాక్షన్ లాగా దాని ప్రభావం భారత షేర్ మార్కెట్ పై పడింది. కేవలం భారత్ లోనే ఇలా జరగలేదు. ఆసియా దేశమైన జపాన్ సహా పలుదేశాల్లో ఈ సోమవారం బ్లాక్ మండేగానే నిలిచింది. భూకంప కేంద్రం ఒక చోట అయితే, దాని ప్రకంపనలు చాలా చోట్ల కనిపించినట్లే ఉంటుందీ ఈ వ్యవహారం.
2015 ఆగస్టులో కూడా చైనా భయాలు, ఇతర కారణాల వల్ల భారత షేర్ మార్కెట్ భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. చైనా శాంఘై సూచి భారీగా పతనమైంది. చైనా ఆర్థిక ప్రభావం కారణంగా వివిధ దేసాల కరెన్సీ పతనం కావడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై అనిశ్చితి, గ్రీస్ ప్రధాని రాజీనామా వంటి కారణాలు షేర్ మార్కెట్ పతనంపై ప్రభావం చూపాయి. అందుకే షేర్ మార్కెట్ పతనం అన్నది ఓ చైన్ రియాక్షన్ ఫలితంగానే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుత సంక్షోభానికి సౌదీ అరేబియా, ఇరాన్ తాజా ఉద్రిక్తతలు కూడా కారణమయ్యాయి.
చైనాలో మార్కెట్ ఒడుదుడుకులను సరిదిద్ధడం కోసం గత వేసవిలో లిస్టెడ్ కంపెనీల షేర్ల అమ్మకాలపై నిషేధం పెట్టారు. అప్పుడు విధించిన ఈ నిషేధాన్ని ఇప్పుడు తాజాగా ఎత్తివేశారు. దీంతో పెట్టుబడిదారులకు ఒక్కసారిగా రెక్కలొచ్చినట్లయింది. జోరుగా షేర్ల విక్రయాలకు దిగారు. ఈ కారణంగానే చైనా మార్కెట్ మహాపతనం దిశగా పరుగులుతీసిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత షేర్ మార్కెట్ లో ఏర్పడిన సంక్షోభం కేవలం తాత్కాలికమైనదేననీ, సెన్సెక్స్, నిఫ్టీ మళ్ళీ పుంజుకుంటాయనీ, ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.