ఆవర్తన పట్టిక (పీరియాడిక్ టేబుల్)లో ఇప్పుడు కొత్తగా నాలుగు మూలకాలు (ఎలిమెంట్స్)వచ్చి చేరాయి. ఆవర్తన పట్టికలోని ఏడవ వరుసలో ఎలిమెంట్స్ 113, 115, 117, 118ని తాజాగా చేర్చారు. కొద్దిరోజుల క్రితం (2015 డిసెంబర్ 30న) ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీకి చెందిన అంతర్జాతీయ సంఘం ధ్రువీకరించిన దరిమిలా ఈ నాలుగు మూలకాలకు ఆవర్తన పట్టికలో చోటుదక్కింది.
రష్యా, జపాన్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ నాలుగు మూలకాలను ఆవిష్కరించారు. అయితే ఈ నాలుగు మూలకాలు సహజసిద్ధమైనవి కావు. కొన్ని ప్రయోగాల ఫలితంగా సిద్ధించిన సూపర్ హెవీ ఎలిమెంట్స్. వీటికున్న విశిష్ట లక్షణాల కారణంగా మూలకాల హోదా దక్కింది. ఈ తరహా మూలకాలున్నట్టుగా 2004 నుంచీ ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ, 11ఏళ్ల తర్వాత వీటికి ధ్రువీకరణ లభించడం గమనార్హం. కాగా, 2011లో 114, 116 నెంబర్లు గల మూలకాలను పీరియాడిక్ టేబుల్ లో చేర్చారు. ఇప్పుడు మిగిలిన 113, 115, 117, 118మూలకాలకు డు అర్హత దక్కింది. ఈ కొత్త ఎలిమెంట్స్ కు ఏడవ ఆవర్తన (పీరియడ్)లో స్థానం కల్పించారు. ఈ కొత్త మూలకాలకు ఇంకా శాశ్వత నామకరణం జరగలేదు. మూలికాలకు నామకరణం చేసేటప్పుడు ఐతిహాసిక అంశాలు, మూలక స్వభావం, దొరికిన ప్రాంతం లేదా దేశం, మూలక లక్షణం, లేదా కనుగొన్న శాస్త్రవేత్త వంటి అంశాలలో ఏదో ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకుని పేరు ఖరారు చేయడం ఆచారంగా వస్తున్నది. ప్రస్తుతానికి 113వ ఎలిమెంట్ ని ununtrium (Uut) గానూ, 115వ మూలకాన్ని ununpentium (Uup) గానూ, 117వ ఎలిమెంట్ ని ununseptium (Uus) పేరుతోనూ, చివరగా నాలుగవ మూలకం 118ని ununoctium (Uuo) పేరుతోనూ పిలుస్తున్నారు.
ఈ ఆవిష్కరణలు శాస్త్రవేత్తలకు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సంపాదించడంకంటే ఘనమైనదిగా 113వ ఎలిమెంట్ ఆవిష్కరణకు సహాయసహకారాలను అందించిన జపాన్ సంస్థ రికెన్ మాజీ అధ్యక్షుడు రాయోజి నొయోరి అభివర్ణించడం విశేషం.