ఓ వైపు అధికార పార్టీ ఆగమేఘాల మీద ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరమంతా హోర్గింగులతో గులాబీ మయంగా మార్చేసింది. 150 డివిజన్లకు ఇన్ చార్జీల నియామకం పూర్తయింది. ఓవరాల్ గా గ్రేటర్ బాధ్యతలను కేటీఆర్, కవితలకు అప్పగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలనూ రంగంలోకి దింపబోతున్నారు. మరోవైపు, టీడీపీ, బీజేపీల్లో మాత్రం పెద్దగా చలనం కనిపించడం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెల్చుకున్న ఈ పార్టీల కూటమి కలిసి పోటీ చేయాలంటే ముందు సీట్ల సర్దుబాట్లు జరగాలి. ఏ డివిజన్ లో ఎవరు పోటీ చేస్తారో ఖరారు చేసుకోవాలి. అప్పుడు ఎవరికి వారు తమ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం ఓట్ల కోసం చేయాల్సిన ప్రకటనలు, ఇవ్వాల్సిన హామీలు దాదాపుగా పూర్తయ్యాయి. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియను 45 రోజుల నుంచి 15 రోజులకు కుదించారు. నామినేషన్ల ఉఫసంహరణ పూర్తయిన తర్వాత ప్రచారానికి వారం రోజులే గడువు ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ప్రచారం చేసి గెలవడం కత్తిమీద సామే. కాబట్టి, దానికి కనీసం నాలుగైదు రోజుల ముందైనా టికెట్లు ఖరారు చేస్తే అభ్యర్థులు కాస్త ఎన్నికలకు సిద్ధం కావడానికి, కేడర్ ను రంగంలోకి దింపడానికి అవకాశం ఉంటుంది. కానీ టీడీపీ, బీజేపీ సీట్ల సర్దుబాటు చర్చలే ఇంకా కొలిక్కి రాలేదు. హటాత్తుగా షెడ్యూలు వచ్చిన తర్వాత నత్తనడకన చర్చలు జరిపి, నామినేషన్ట ఘట్టం తుదిదశలో నిర్ణయాలు తీసుకుంటే అది వికటించ వచ్చు.
ఒకే డివిజన్ కోసం రెండు పార్టీలూ పట్టుబట్టే సందర్బాలు చాలానే ఉండొచ్చు. ఇరు పార్టీల నుంచీ టికెట్ ఆశించే వారు చాలా మందే ఉంటారు. కాబట్టి వారందరికీ నచ్చజెప్పి ఎన్నికల ప్రచారంలోకి దింపాలంటే కొంత సమయం కావాలి. కాబట్టి ఈపాటికే డివిజన్ల వారీగా పొత్తు కుదిరి ఉండాల్సింది.
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం చివరి దాకా సస్పెన్స్ సినిమాను తలపించింది. అసలు పొత్తు వద్దే వద్దని కిషన్ రెడ్డి అంటున్నారని వార్తలు వచ్చాయి. ఎక్కువ సీట్లు బీజేపీకే కావాలని పట్టుబడుతున్నారని ప్రచారం జరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియవస్తున్నా పొత్తు ఎటూ తేలలేదు. ఒక దశలో ఎవరికి వారు ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డారు. కేడర్ అయోమయానికి గురైంది. సమన్వయానికి బదులు అసహనం మొదలైంది. చివరకు జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని కచ్చితమైన ఆదేశాలు ఇవ్వడంతో పొత్తు ఖరారైంది. ఈ ప్రభావం ఎంతో కొంత ఎన్నికల ఫలితాలపై పడిందని ఇరు పార్టీల వారూ ఆఫ్ ది రికార్డుగా ఒప్పుకుంటారు. ఈసారి కూడా అదే జరగాలా?
అసెంబ్లీ కంటే కార్పొరేటర్ ఎన్నిక పరిధి తక్కువ. పంతాలు పట్టింపులు ఎక్కువ. కాబట్టి, రెండు పార్టీల మధ్య సమన్వయ సాధనకు తగినంత సమయంలేకపోతే అది చివరకు తెరాసకు మేలు చేసే అవకాశం ఉంది. కేడర్ ను అయోమయంలో పడేస్తే నష్టపోయేది టీడీపీ, బీజేపీలే. అసలే పరిస్థితి బాగాలేదు. తెరాస ఆపరేషన్ ఆకర్శతో ఇప్పటికే టీడీపీ గణనీయంగా దెబ్బతిన్నది. బీజేపీలోనూ అంతగా జోష్ కనిపించడం లేదు. కనీసం ఈ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లను గెలిచి సత్తా చాటాలనే దృఢ సంకల్పం ఈ కూటమిలో ఉందా అనేది అనుమానమే.