ఇటీవల పార్లమెంటు చేత ఆమోదించబడిన బాలనేరస్థుల చట్టం-2015కి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న ఆమోదముద్ర వేశారు. త్వరలో దానిపై అధికారిక ప్రకటన వెలువడగానే అది చట్టంగా అమలవుతుంది.
నిర్భయ కేసులో బాల నేరస్తుడు మిగిలిన అందరి కంటే అతి క్రూరంగా ఆమెపై అత్యాచారం చేసి హింసించి ఆమె మరణానికి కారకుడయినపట్టికీ, అప్పటికి అతని వయసు 18సం.ల కు కొన్ని నెలలు తక్కువగా ఉండటంతో అతనిని బాలనేరస్తుడిగానే పరిగణించి బాల నేరస్తుల గృహంలో మూడేళ్ళ పాటు నిర్బందించి కొన్ని రోజుల క్రితమే విడుదల చేసారు. అందుకు చాలా మంది ప్రజలు నిర్భయ తల్లి తండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసారు. అతనిని మరికొంత కాలం నిర్బంధించాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసారు. కానీ చట్ట ప్రకారం అతనిని ఇక నిర్బందించడం సాధ్యం కాదని, చట్టాలు తమ చేతులను కట్టి వేశాయని డిల్లీ హైకోర్టు చెపుతూ ఆ పిటిషన్ని కొట్టివేసి అతనిని విడుదల చేసింది. సుప్రీం కోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో నిర్భయ తల్లితండ్రులు తమ కుమార్తెకి ప్రభుత్వం, న్యాయస్థానాలు న్యాయం చేయలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు కూడా వారితో ఏకీభవిస్తూ నిరసనలు తెలియజేయడంతో ఎట్టకేలకు పార్లమెంటులో ఆ చట్టాన్ని ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సహకరించాయి.
బాలనేరస్థుల వయసును 18 నుండి 16సం.లకు తగ్గిస్తూ చట్ట సవరణ చేసారు. కనుక సవరించబడిన ఆ బాలనేరస్థుల చట్ట ప్రకారం ఇక నుండి 16సం.ల వయసున్న బాల నేరస్తులు హత్యలు, మానభంగాలు వంటి నేరాలలో దోషులుగా నిరూపించబదినట్లయితే వారికీ పెద్దవారితో సమానంగా పరిగణించి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తాయి. గత రెండు మూడు నెలలలో అనేకమంది బాలనేరస్తులు ఇటువంటి నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. వారందరికీ ఈ సవరించబడిన ఈ చట్ట ప్రకారం శిక్షలు ఎదుర్కోక తప్పకపోవచ్చును.