ప్రముఖ దర్శకుడు, నటుడు మరియు మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు త్వరలో వైకాపాలో చేరబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా మంగళవారం హైదరాబాద్ లోని దాసరి నివాసానికి వెళ్లి కలిసారు. ఆయనతో బాటు పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. దాసరి నారాయణ రావు వైకాపాలో చేరబోతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దృవీకరించారు.
సమావేశం అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ “ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం. నాకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డితో మంచి అనుబంధం ఉంది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న అలుపెరుగని పోరాటం నన్ను చాలా ఆకర్షించింది. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని నేను మనసార నమ్ముతున్నాను. అతనికి నా ఆశీసులు ఎల్లపుడు ఉంటాయి,” అని అన్నారు. త్వరలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ఉన్నందున ఈలోపే దాసరి నారాయణ రావు వైకాపాలో చేరే అవకాశం ఉందని సమాచారం.ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కాపు సామాజిక వర్గాన్ని మంచి చేసుకొని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే ఆ వర్గానికి చెందిన దాసరి నారాయణ రావుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నరేమో?