సంక్రాంతి రేసులో దిల్ రాజు నిర్మించిన సినిమా లేకపోయినా తను డిస్ట్రిబ్యూట్ చేసే రెండు సినిమాలు ఒకరోజు తేడాతో రావడం దిల్ రాజుని టెన్షన్ లో పడేసిందని తెలుస్తుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రీవాస్ దర్శకత్వంలో చేసిన డిక్టేటర్, మేర్లపాక గాంధి దర్శకత్వంలో విలక్షణ నటుడు శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా ఒక్కరోజు తేడాతో విడుదలవుతున్నాయి. దిల్ రాజుకి నైజాంలో మంచి పట్టు ఉందని ఈ రెండు సినిమాలు తన చేతిలో పెట్టారు.
అయితే డిక్టేటర్ కు, ఎక్స్ ప్రెస్ రాజాకు పోటీ లేకపోయినా ఈ రెండిటికి పోటీగా నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు వస్తుండటంతో దిల్ రాజుకి టెన్షన్ మొదలైందట. డిక్టేటర్ బాలయ్య 99వ సినిమాగా భారీ అంచనాలతో వస్తుండగా.. సినిమాను కచ్చితంగా హిట్ చేసి నందమూరి స్టామినా ఏంతో మరోసారి రుజువు చేయాలనుకుంటున్నారు అభిమానులు. ఇక ఎక్స్ ప్రెస్ రాజా కాన్సెప్ట్ ఓరియెటెడ్ మూవీ కాబట్టి ఆ సినిమా దర్శక నిర్మాతలు కూడా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు.
అయితే డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఏ సినిమా ఏ థియేటర్ లో వేయాలో అర్ధంకాని పరిస్థితి అయ్యిందట. నైజాంలో మెజారిటీ థియేటర్స్ తన చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ రెండికి పెద్దగా సమస్య వచ్చే అవకాశం లేదు. కాని సినిమాల ఫలితం మీదే దిల్ రాజు కంగారు పడుతున్నాడని తెలుస్తుంది. మరి దిల్ రాజు టెన్షన్ తీరాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే..!