పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి జరిగిన తరువాత పాక్ విదేశాంగ శాఖ దానిని తీవ్రంగా ఖండించింది. కానీ అటువంటి కంటి తుడుపు మాటలతో భారత్ సంతృప్తి చెందలేదనే విషయం గ్రహించిందో లేక అంతర్జాతీయ ఒత్తిళ్ళ కారణం చేతనో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి ఈ దాడి గురించి మాట్లాడారు. ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థపై, అలాగే కొందరు వ్యక్తులపై (ఐ.ఎస్.ఐ. అధికారులు?) తక్షణమే కటినమయిన చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడి కోరగా అందుకు నవాజ్ షరీఫ్ అంగీకరించారు. ఈ దాడికి కుట్రపన్నిన వారెవరినీ ఉపేక్షించబోనని నవాజ్ షరీఫ్ మోడీకి హామీ ఇచ్చేరు. ఈ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న ఉగ్రవాదుల పేర్లు, ఈ దాడిలో వారి పాత్ర గురించి తెలిపే వివరాలను పాకిస్తాన్ కి అందజేసి వారందరిపై తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా భారత్ కోరింది.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పటికయినా చొరవ తీసుకోవడం చాలా మంచి నిర్ణయమని చెప్పవచ్చును. ఆయన పాక్ సైనికాధికారుల, ఉగ్రవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహించి ఉంటే, ఆయనపై మోడీ నమ్మకం వమ్ము అయ్యుండేది. మోడీ లాహోర్ పర్యటించి రాగానే ఈదాడి జరగడంతో మోడీ వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. పాకిస్తాన్ మళ్ళీ మరోమారు భారత్ ని వంచించిదని, కనుక ఈసారి పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని శివసేన వంటి పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా చొరవ తీసుకొని మోడీకి ఫోన్ చేసి ఉగ్రవాదులపై తక్షణమే కటినమయిన చర్యలు తీసుకొంటానని హామీ ఇవ్వడం వలన ఇరుదేశాల మధ్య పరిస్థితులు మళ్ళీ చక్కబడే అవకాశం ఏర్పడింది. కానీ నవాజ్ షరీఫ్ కేవలం మాటలతో సరిబెట్టకుండా చేతలలో దానిని నిరూపించి చూపవలసి ఉంటుంది. అది ఆయన వలన అవుతుందో లేదో త్వరలోనే చూడవచ్చును. ఒకవేళ ఆయన మాటలకే పరిమితమయితే అప్పుడు భారత్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇక మరో ఆసక్తికరమయిన విషయమేమిటంటే, నిన్ననే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి చెందిన యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ఈ దాడికి పాల్పడింది తామేనని ప్రకటించుకొంది. ఈ దాడితో పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించింది. కానీ ఈ దాడికి పాల్పడింది జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అని భారత్ దృడంగా నమ్ముతోంది. వారిపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడి కోరినప్పుడు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని అందుకు అంగీకరించారు. అంటే ఈ దాడికి కుట్రపన్నింది జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదులేనని పాక్ కూడా అంగీకరిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.
ఇదివరకు ఎప్పుడయినా ఇటువంటి దాడులు జరిగిన వెంటనే భారత్, పాక్ దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకొనేవి. ఆ దాడులతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని పాక్ వెంటనే ప్రకటించి ఉండేది. కానీ ఈసారి రెండు దేశాలు చాలా సానుకూలంగా, సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. అందుకు మోడీ లాహోర్ పర్యటనే కారణమని వేరేగా చెప్పనవసరం లేదు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మొట్టమొదటిసారిగా తమ దేశంలో ఉన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకొంటామని అంగీకరించడం గమనార్హం. తద్వారా ఈదాడికి పాక్ లోనే కుట్ర జరిగిందనే విషయం కూడా ఆయన అంగీకరించినట్లే భావించవచ్చును. ఇది చాలా ఊహించని మార్పనే చెప్పుకోవచ్చును. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇదే స్ఫూర్తి నిలుపుకోగలిగితే, ఇరుదేశాల మధ్య సఖ్యత కొనసాగుతుంది.