ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దౌత్యనీతికి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. ఇప్పటి వరకూ అనేక తప్పటడుగులు వేసిన మోడీ, ఇక ముందు సరైన దారిని ఎంచుకోకపోతే దేశానికి మరింత నష్టం జరుగుతుంది. కరాచీ నుంచి నేరుగా లాహోర్ కు వెళ్లి హీరో అవుదామనుకున్న మోడీ ఇప్పుడు జీరో అయ్యారనే విమర్శల్లో అర్థం ఉంది. పఠాన్ కోట్ దాడి తర్వాతైనా ఆయన వాస్తవాలను గుర్తించకపోతే 125 కోట్ల మంది ప్రయోజనాలను పణంగా పెట్టడమే అవుతుంది.
తొలి ప్రధాని నెహ్రూ హయాంలో దౌత్య పరంగా అనేక వైఫల్యాలు ఉండొచ్చు. అయితే, ప్రపంచంలో అతి నమ్మకమైన దేశాన్ని ఎంచుకునే విషయంలో మాత్రం నెహ్రూ పొరపాటు చేయలేదు. అలీన విధానాన్ని అనుసరిస్తూనే సోవియట్ యూనియన్ కు భారత్ ను ఆప్త మిత్ర దేశంగా మార్చారు. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎన్నో సార్లు అంతర్జాతీయ వేదికల మీద మనల్ని ఇరుకున పెట్టింది. అప్పుడు అమెరికా అడ్డంగా పాక్ ను సమర్థించింది. అలాంటి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం మన వెన్నంటి ఉన్న ఒకే ఒక్క దేశం సోవియట్ యూనియన్. అదే ఈనాటి రష్యా.
పాకిస్తాన్ ను కట్టడి చేయాలంటే చర్చలతో లాభం లేదు. దెబ్బకు దెబ్బ తీయడం ఒక్కటే మార్గం. ఉగ్రవాదులు దాడి చేసిన ప్రతిసారీ పాక్ హస్తంపై మనం ఆధారాలు పంపడం, అవన్నీ అబద్ధమని పాక్ ఖండించడం షరా మామూలే. మారిన పరిస్థితుల్లో అమెరికా మన పట్ల అతిప్రేమను చూపిస్తోంది. అది మనమీద ప్రేమ కాదు. మన మార్కెట్ మీద ఉన్న ధ్యాస. భారత్ అతిపెద్ద మార్కెట్. టూత్ పేస్టుల నుంచి యుద్ధ విమానాల దాకా ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవడానికి అనువైన దేశం. కాబట్టి భారత్ తో స్నేహం అమెరికాకు అవసరం. అమెరికా సర్కారుది పక్కా వ్యాపార ధోరణి. అయితే, పాకిస్తాన్ తో అమెరికాకు పెద్దగా లాభం లేకపోయినా దానికీ వీలైనంత సహాయం చేయడానికి కారణం ఉంది. పాక్ ముస్లిం దేశం. మధ్య ప్రాచ్యానికి పొరుగున ఉన్న దేశం. పైగా ఆఫ్ఘనిస్తాన్ తో సుదీర్ఘ సరిహద్దులున్న దేశం. కాబట్టి దానితో అమెరికాకు అవసరాలున్నాయి.
అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అల్ ఖైదాను అంతం చేయడానికి అమెరికా ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది. తాలిబన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. అల్ ఖైదాను భారీగా దెబ్బతీసింది. అదేమిటంటే, నా పౌరులను కాపాడుకునే హక్కు నాకుందని వాదించింది. మరి అదే హక్కు బారత్ కు ఉండదా? ఇప్పటి వరకూ వందకు పైగా దాడులు చేయించిన పాక్ మీద మనం ప్రతీకారం తీర్చుకోవద్దా? తనకు మోస్ట్ వాంటెడ్ అయిన లాడెన్ ను మట్టుబెట్టడానికి అమెరికా అబోటాబాద్ లోని అతడి నివాసం మీదే దాడి చేసింది. గుట్టు చప్పుడు కాకుండా మట్టుబెట్టింది. మృతదేహాన్ని సముద్రంలో పడేసింది. మనకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్ సహా దాదాపు 50 మంది పాకిస్తాన్ లో హాయిగా ఆశ్రయం పొందారు. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సయీద్ అయితే తరచూ బహిరంగ సభల్లో భారత్ ను తిడుతూ ప్రసంగిస్తుంటాడు. అయినా, అతడిని భారత్ కు అప్పగించడం లేదు ఎందుకని పాకిస్తాన్ ను అమెరికా అగడటం లేదు. మనం ఏదైనా దూకుడుగా నిర్ణయం తీసుకుందామనుకుంటే మాత్రం అడ్డుకుంటుంది. శాంతి, స్నేహం అని మనకు ఉపదేశాలు ఇస్తుంది. అమెరికాకు బాగా తెలిసింది వ్యాపారమే. మోడీ వచ్చిన తర్వాత అమెరికాతో దోస్తీ మరీ ఎక్కువైంది.
మూడు నెలల క్రితమే 2.5 బిలియన్ డాలర్లతో అమెరికా అపాచే, చినూక్ హెలికాప్టర్లను కొనడానికి మోడీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అంతకు ముందు అమెరికా కోరుకున్న షరతులతో అణు ఒప్పందం ద్వారా మన్మోహన్ ప్రభుత్వం భారీ నజరానా అందించింది. గత ఏడాదిగా అమెరికాతో అతి స్నేహం వల్ల మనకు ఏం ఒరిగింది? పక్కలో బల్లెం లాంటి పాకిస్తాన్ ను దారి తెచ్చే విషయంలో అణువంతైనా అమెరికా సహకరించిందా? పాక్ వైఖరిలో రవ్వంతైనా మార్పు తేగలిగిందా? మోడీ లాహోర్ పర్యటన తర్వాత వారం రోజులకే పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది. నిజమైన మిత్ర దేశమే అయితే అమెరికా ఎందుకు స్పందించ లేదు? పాకిస్తాన్ కు వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు?
అదే సోవియట్ యూనియన్ పరిస్థితి వేరు. కాశ్మీర్ పై ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు వివాదం తలెత్తినా అండగా నిలిచింది. పాకిస్తాన్ ను చైనా, అమెరికా గట్టి సమర్థించిన పరిస్థితుల్లో సోవియట్ వీటో ద్వారా మనకు కొండంత అండగా నిలబడింది. ఇప్పటికీ భారత్ కు సిసలైన మిత్రదేశంగా అండగా ఉండేది రష్యానే అని మన దేశంలో చాలా మంది అభిప్రాయం. మన మాజీ రాష్ట్రపతి అని తెలిసీ, అబ్దుల్ కలాంను ఎయిర్ పోర్టులో అవమానకరంగా శల్యపరీక్ష చేసిన అమెరికాను నమ్మడం కష్టమని అనేకసార్లు రుజువైంది. పైగా, అమెరికా వ్యాపారం కంటే రష్యా సహకారమే మేలనే వారి అభిప్రాయాన్ని మోడీ పరిగణన లోకి తీసుకుంటారా? ఏమో, వేచి చూద్దాం.