జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో విజయం సాధించడానికి తెరాస అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసుకొంది. కానీ హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్ర ఓటర్లు దానికి ఓటు వేస్తేనే అది విజయం సాధించగలుగుతుంది. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రా ప్రజల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు వారినే ఓట్లు అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఆత్మవిమర్శ చేసుకోవలసిన తెరాస, ఇప్పుడు కూడా వారినే ఆత్మవిమర్శ చేసుకొని తమ పార్టీని గెలిపించమని కోరడం చాలా విచిత్రంగా ఉంది.
ఈ మాట అన్నది ఎవరో కాదు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యత భుజానికెత్తుకొన్న మంత్రి కె.టి.ఆర్. తెదేపా నేత విజయరామారావుని పార్టీలో చేర్చుకొంటున్న సందర్భంలో కె.టి.ఆర్. మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకొంటున్నారనే మేము ఆంధ్ర ప్రజలను నిందించాము. ఆ కారణంగా 2014 ఎన్నికలలో జంట నగరాలలో ఆంధ్ర ప్రజలు మాకు ఓటు వేయలేదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకొన్న సంగతి వారికీ తెలుసు. కనుక ఆత్మవిమర్శ చేసుకొని తెరాసకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను,” అని అన్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు దానిని అడ్డుకొంటున్నందుకు ఆంద్ర ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరించామని చెపుతున్న మంత్రి కె.టి.ఆర్.రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చాలా కాలం పాటు అదే ధోరణి కొనసాగించించిన సంగతి గురించి ప్రస్తావించడం లేదు. ఆ విధంగా వ్యవహరించినందుకు ఆంద్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమకి ఉందా లేదా? అని తెరాస నేతలే ఆత్మవిమర్శ చేసుకొంటే బాగుంటుంది. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్ర ప్రజల మీద ఈగ వాలనీయడం లేదని తెరాస నేతలు పదేపదే ఎందుకు చెప్పుకోవలసివస్తోందిపుడు?అదే..వారు ఆంధ్రా ప్రజల పట్ల ఇంతవరకు ఏవిధంగా వ్యవహరించారో చాటిచెపుతోంది.
హైదరాబాద్ జంటనగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలలో అభద్రతాభావం పెంచి పోషించింది తెరాసయే. ఆంధ్రా ప్రజలలో అభద్రతాభావం నెలకొని ఉన్నందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కోసమే హైదరాబాద్ నుండి రాష్ట్రాన్ని పరిపాలించాలనుకొన్నారు. కానీ చివరికి ఆయన కూడా తీవ్ర అభద్రతాభావంతో విజయవాడకు తరలివెళ్ళిపోవలసి వచ్చిందనే సంగతి అందరికీ తెలుసు.ఒక ముఖ్యమంత్రికే ఆ పరిస్థితి ఉందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. కనుక ఆంధ్రా ప్రజలను ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పడం కంటే తెరాస నేతలే ఆత్మవిమర్శ చేసుకోవడం సబబుగా ఉంటుంది. అసలు మొదటి నుంచి ఆంధ్రా ప్రజల పట్ల వివక్ష, విద్వేషం ప్రదర్శించకుండా, హైదరాబాద్ లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలలాగే చూసి ఉండి ఉంటే నేడు ఈవిధంగా వారిని బ్రతిమాలుకొనే అవసరమే ఉండేది కాదు.