హైదరాబాద్: కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో ఐసిస్ ఉగ్రవాదం ఉందని మంత్రి అన్నారు. దేశమంతా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పూజిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిజామ్‌ను పొగుడుతోందని విమర్శించారు. ఉద్యోగావకాశాలు లేకపోవటంవల్లే యువత ఉగ్రవాదంవైపు చూస్తోందని అన్నారు. హైదరాబాద్ నల్లకుంటలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త, చెదారం దర్శనమిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఫ్లెక్సీలపైనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని కిషన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన యువకులు కొందరు ఇటీవల ఐసిస్‌లో చేరటానికి వెళుతూ నాగపూర్‌లో పోలీసులకు చిక్కిన ఘటనపైనే కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది. బొగ్గుగనుల కుంభకోణాన్ని వెలికితెచ్చిన నేతగా హన్స్‌రాజ్ గంగారామ్ ప్రసిద్ధులు.