యుద్ధోన్మాదంతో తహతహలాడుతున్న కమ్యూనిస్ట్ దేశం ఉత్తర కొరియా బుదవారం ఉదయం హైడ్రోజన్ బాంబును పేల్చడంతో దక్షిణ కొరియా మరియు దానికి మద్దతు ఇస్తున్న అమెరికా తదితర అగ్రరాజ్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భూగర్భంలో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమయినట్లు ఉత్తర కొరియా స్వయంగా ప్రకటించింది. ఉత్తరకొరియాలో ఈ ప్రయోగం చేసినప్పుడు చిన్న పాటు భూకంపం సంభవించింది అది రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రత కలిగినట్లు నమోదు అయ్యింది. దానిని బట్టే అది అణుబాంబు కంటే ఎంత శక్తివంతమయినదో అర్ధం చేసుకోవచ్చును. హైడ్రోజన్ బాంబుని తయారు చేస్తున్నట్లు ఉత్తర కొరియా గత ఏడాదే ప్రకటించింది.
తమ దేశానికి సవాలు విసురుతున్న ఇటువంటి ప్రయోగం చేసినందుకు ఉత్తర కొరియా బారీ మూల్యం చెల్లించుకోక తప్పదని దక్షిణ కొరియా హెచ్చరించింది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు దీనిని తీవ్రంగా ఖండించాయి. ఈ సంగతి తెలియగానే ఐక్యరాజ్యసమితిలో భద్రతా సమితి అత్యవసర సమావేశం నిర్వహించింది. 2006, 2009, 2013 సం.లలోఅణుబాంబు పరీక్షలు జరిపినందుకు ఇప్పటికే ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి అనేక ఆంక్షలు విధించింది. ఇప్పుడు కొత్తగా ఇంకా అనేక ఆంక్షలు విదించే అవకాశం ఉంది.