దేవి శ్రీ ప్రసాద్.. తెలుగులో దాదాపు ఓ స్టార్ హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. తన డిఎస్పీ బ్రాండ్ తో దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్నాడు దేవి. అయితే.. ఈ ఫాలోయింగ్ సరిపోదన్నట్టు అప్పుడప్పుడు వెండితెర మీద తళుక్కుమంటూనే ఉన్నాడు. అయితే ఇవన్నీ సంతృప్తిని కలిగిస్తున్నట్టు లేవు. తనే హీరో కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఆ దూకుడు వెనుక ఉన్న వ్యక్తి వేరే ఉన్నారంటున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ ని దారి మళ్లించేందుకు, హీరోగా తెరమీదకి ఎక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది మరెవరో కాదు, సుకుమార్. ఆర్య సినిమా నుంచి ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. సుక్కు కోసం స్పెషల్ సాంగ్స్ ఇస్తుంటాడు దేవి. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా ఈ మధ్య కుమారి 21 ఎఫ్ అనే సినిమాకి రూపాయి కూడా తీసుకోకుండా సంగీతం అందించాడు దేవి.
దేవి కళ్లల్లో హీరో ఆనందం కోసం సుకుమార్ కలం పట్టి కథ రాస్తున్నాడట. మెగా ఫోన్ పట్టి సినిమా డైరెక్షన్ చేయాలని తపిస్తున్నాడు. దేవి కోసం హీరోయిన్ ని కూడా వెతికినట్టు తెలుస్తోంది. రాక్ స్టార్ లాంటి దేవి పక్కన సమంత అయితే బావుంటుందని ఆమెతో చర్చిస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. మరి దారితప్పిన దేవికి సుకుమార్ విజయం అందిస్తాడో లేదో తెలియాలంటే ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే సినిమా ఫలితాన్ని చూస్తేనేగాని చెప్పలేం.