హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో డిఫెన్స్‌లో పడ్డ బాబు అండ్ కో మొదట్లో అయోమయంలో పడిపోయి ప్యానిక్ బటన్ నొక్కేసిన సంగతి తెలిసిందే. పరకాల ప్రభాకర్ దగ్గరనుంచి మొదలుపెట్టి చంద్రబాబు వరకు అందరూ ఒకరికొకరు సంబంధంలేకుండా తలా ఒక రకంగా మాట్లాడటం, తద్వారా సమస్య మరింత సంక్లిష్టమవటం అందరూ చూశారు. అయితే మెల్లగా తేరుకున్న తెలుగుదేశం నాయకత్వం ఆచి తూచి అడుగులు వేస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో కూలంకషంగా చర్చించి సంక్షోభ పరిష్కారానికి చర్యలు మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డిని తెలంగాణ ఏసీబీవారు వలవేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటుంటే పసిగట్టలేకపోవటం ఏపీ ఇంటెలిజెన్స్ వైఫల్యమని గుర్తించారు. చంద్రబాబు సంబంధిత అధికారులకు తీవ్రంగా చీవాట్లు పెట్టారని అభిజ్ఞవర్గాల సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ చేయటం స్టీఫెన్సన్ను రేవంత్ ప్రలోభపెట్టటంకంటే పెద్ద నేరంకాబట్టి దానిమీద దృష్టిపెట్టి ఎదుటివారిని కార్నర్ చేయొచ్చని తెదేపా నేతలు నిర్ధారణకొచ్చారు. అంతేకాక రేవంత్‌పై కేసు పెట్టటంలో, సెక్షన్లు అనువర్తించటంలో తెలంగాణ ఏసీబీ చేసిన తప్పులనుకూడా గుర్తించారు. దానికితోడు హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి జీహెచ్ఎమ్సీ అనుమతి నిరాకరించటం తెలుగుదేశానికి కలిసొచ్చింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వ అధికారులపై తెలంగాణ ప్రభుత్వోద్యోగుల ధాష్టీకం మొదలైన అంశాలన్నింటినీ చూపి సెక్షన్ 8 అమలుకు మరింత బలంగా కేంద్రాన్ని డిమాండ్ చేయటానికి అవకాశం లభించినట్లయింది. ఈ పరిణామాలన్నింటితో తెలుగుదేశం నేతలకు క్రమేణా ధైర్యం ఇనుమడించింది.
కేసీఆర్ ప్రభుత్వంపై ఒకవైపు పోలీసులద్వారా చట్టపరంగా, మరోవైపు పార్టీ నేతలతో మీడియాద్వారా ఎదురుదాడి ముమ్మరం చేశారు. చంద్రబాబు టెలిఫోన్ సంభాషణలంటూ టేప్ బయటపెట్టిన టీన్యూస్ ఛానల్‌కు, పనిలో పనిగా సాక్షి టీవీకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు జగన్‌కు, స్పీఫెన్సన్కూ క్రైస్తవ లింకేదో ఉందన్నట్లు తెలుగుదేశంనేతలు ఒక కొత్త కోణాన్ని బయటపెట్టారు. జగన్, హరీష్ రావు, స్పీఫెన్సన్ పదిరోజులముందే రహస్యంగా కలిసి రేవంత్ వ్యవహారానికి కుట్రపన్నారని యనమల నిన్న మీడియాకు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, జగన్‌కు యనమల 24 ప్రశ్నలు సంధించారు. అసలు రేవంత్‌పై తప్పుగా సెక్షన్లు పెట్టారని, ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లు పెట్టాల్సిఉన్నప్పటికీ బెయిల్ రాకుండా చేయటానికి వేరే సెక్షన్లు పెట్టారని తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి ఆరోపించారు. గతంలో వరంగల్‌లో రు.60 లక్షలు ఓటర్లకు పంచుతూ పట్టుబడిన టీఆర్ఎస్ నేతలపైకూడా ప్రజాప్రాతినిధ్యచట్టం సెక్షన్లు పెట్టినట్లు సాక్షి పేపర్లో వచ్చిన వార్తలనుకూడా ఆయన చూపారు. ఈ పరిణామాలన్నిటిదృష్ట్యా ఇంతవరకు వెనుకంజలో ఉన్నట్లు కనిపించిన తెదేపా ప్రస్తుతం దూకుడుమీద ఉన్నట్లు అనిపిస్తోంది.