ఏపీ రాజకీయాల్లో సంక్రాంతి సినిమా ట్రైలర్‌లా మారింది దాసరి-జగన్‌ల భేటీ. ఈ సమావేశంతో రాజకీయ వర్గాల్లో ఏవేవో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత దాసరి నారాయణరావును… ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఇంటికెళ్లి పలకరించారంటే రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనించకుండా ఉండవు.
రాజకీయాల్లో కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటూ… సినిమా ఫంక్షన్లలో కూడా కనిపించకుండా దూరంగా ఉన్న దాసరిని జగన్ వెళ్లి సడెన్‌గా ఎందుకు కలుసుకున్నారు? అనారోగ్యంతో ఉన్న దాసరిని పరామర్శించడానికి వెళ్లానని జగన్ పైకి చెప్తున్నా … తెరవెనుక వేరే కథ ఉండే ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కాపుల చుట్టే తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో కాపులు కీలకపాత్ర పోషించారు. మెజార్టీ కాపులు ఏ పార్టీని బలపరుస్తారో ఆ పార్టీ గెలుపు ఖాయమనేంతగా ప్రభావితం చేస్తుంది ఆ సామాజికవర్గం. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల కాపులు రాష్ట్ర రాజకీయాలను నిర్ణయిస్తారంటారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావంతో కాపులు తెలుగుదేశానికి ఓటేసి గెలిపించారు. ఇక ఇప్పుడు కాపుల్ని బిసిల్లో చేర్చడానికి కమిటీ కూడా వేసింది టిడిపి ప్రభుత్వం. కాపుల అభ్యున్నతి కోసం వందకోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్, బీసీల్లో చేర్చేందుకు రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో కమిషన్ వంటి నిర్ణయాలు తీసుకుంది. అది జరిగితే కాపులు టిడిపికి స్టిక్ఆన్ అయ్యే అవకాశం ఉంది.
ఆ ప్రమాదాన్ని గుర్తించే ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన దాసరి నారాయణరావును జగన్ కలుసుకోవడం అందులో భాగమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు జగన్ అడుగులన్నీ కాపులకు గాలమేసేలా ఉన్నాయి. మరి పార్టీలో చేరాలని దాసరిని జగన్ ఆహ్వానించారా? లేదా అన్నది సస్పెన్స్‌గానే మిగిలింది. దాసరి పార్టీ మార్పు విషయంపై ఏమీ మాట్లాడలేదు. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఆశీస్సులు అందించారంతే.
మరి ఈ మర్యాదపూర్వక సమావేశం ఎటు దారితీస్తుంది? దాసరి ఏం చేయబోతున్నారు? అన్నదానిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.