పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి తరువాత ఇప్పుడు ఆ పరిసరాలలో కొత్త వ్యక్తులు ఎవరు కనబడినా అందరూ అనుమానంగా చూస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దుకి అతి సమీపంలో ఉన్న గురుదాస్ పూర్, పఠాన్ కోట్ పట్టణాలలోకి ఐదుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు సమాచారం అందడంతో భద్రతాదళాలు అప్రమత్తం చేయబడ్డాయి. గురుదాస్ పూర్ జిల్లాలో తిబ్రి అనే గ్రామంలో మిలటరీ దుస్తులు ధరించిన ఇద్దరు కొత్త వ్యక్తులను చూసామని గ్రామస్తులు స్థానిక పోలీసులకు తెలియజేయడంతో వారు తక్షణమే ఆ విషయాన్ని ఆర్మీ అధికారులకు తెలియజేసారు. పంజాబ్ పోలీసులతో కలిసి ఆర్మీ సైనికులు ఆ పరిసరాలను చుట్టుముట్టి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. తిబ్రీ గ్రామంలో కనబడిన ఇద్దరు అనుమానితుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుదవారం రాత్రి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్ ని తెరిచి చూపించమని పోలీసులు అడిగినప్పటికీ అతను చూపించకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.