తెలంగాణా ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె.టి.ఆర్. ప్రధాన ఆరోపణ ఏమిటంటే తెలంగాణా ఏర్పడి ఏడాదిన్నర అయినా ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణా గడ్డపై అడుగుపెట్టలేదని. అలాగే తెరాస నేతల మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని. ఈ రెండు ఆరోపణలకు ఒకే సమాధానంగా వచ్చే నెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడి రామగుండంలో నిర్మించబోయే ఎరువుల కర్మాగారానికి శంఖుస్థాపన చేయడానికి రాబోతున్నారని బీజేపీ నేతలు చెపుతున్నారు. దానితో బాటే రామగుండంలో ఎన్.టి.పి.సి. నిర్మించ తలబెట్టిన 4000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా శంఖుస్థాపన జరుగవచ్చని సమాచారం. తద్వారా ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణాలో పర్యటించినట్లు అవుతుంది. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి మిగిలిన అన్ని రాష్ట్రాలలాగే కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చాటి చెప్పినట్లు అవుతుంది.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై తెరాస చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి ఇది బీజేపీకి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ కార్యక్రమాన్ని ఈ నెలలోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరిగేలోగా పెట్టుకొని ఉంటే దాని వలన బీజేపీకి చాలా ప్రయోజనం కలిగి ఉండేది. కానీ ప్రధాని మోడి షెడ్యూల్ ఖాళీ లేకపోవడంతో వచ్చే నెల మొదటివారంలో పెట్టుకోవలసి వచ్చినట్లు తెలుస్తోంది.