తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు తెరాస ప్రభుత్వంపై ఏవిధంగా విమర్శలు గుప్పిస్తున్నాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు కూడా తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కాకపోతే ఒకే ఒక తేడా ఏమిటంటే తెలంగాణాలో ప్రతిపక్షాలపై తెరాసదే పైచెయ్యిగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో తెదేపాపై వైకాపాదే పైచెయ్యిగా కనబడుతోంది. అందుకు కారణం తెరాసలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా నలుగురైదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు చాలా మంది ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూ వాటి ఆరోపణలకు గట్టిగా సమాధానాలు ఇస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది నేతలని తెరాసలోకి ఆకర్షించే కార్యక్రమం వలన ప్రతిపక్షాలు చాలా బలహీనపడ్డాయి. వివిధ ఎన్నికలలో వరుస ఓటముల కారణంగా ప్రతిపక్షాలు ఆత్మవిశ్వాసం కోల్పోయి చాలా డీలా పడున్నాయి.
కానీ ఆంధ్రాలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 2014 ఎన్నికలలో అపూర్వమయిన జనాధారణతో బారీ అంచనాల నడుమ అధికారం చేపట్టిన తెదేపాకు వరుసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ విషయంలో చాలా ఇబ్బందులు పడింది. పైగా రుణమాఫీ, బాక్సైట్ తవ్వకాలు వంటి విషయాలలో ప్రభుత్వం తప్పటడుగులు వేసి విమర్శలు మూటగట్టుకొంది. ఇటువంటి అనేక అంశాలు, కారణాలు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఆయుధాలుగా అందివచ్చేయి. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని తప్పటడుగులు వేస్తునప్పటికీ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు ముందుంటున్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినడం, ప్రజాదారణకు నోచుకోకపోవడం చేత సహజంగానే ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాకు బాగా కలిసి వచ్చింది.
విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అనేక కారణాల చేత సాధారణంగా ప్రజలలో అధికారంలో ఉన్న పార్టీ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత నెలకొని ఉంటుంది. అటువంటి సమయంలో ప్రతిపక్షాలు బలమయిన ఆధారాలతో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపిస్తున్నపుడు అధికారపార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఆ ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనలేకపోయినట్లయితే, ప్రజలలో ప్రభుత్వంపట్ల అపనమ్మకం, వ్యతిరేకత మరింత పెరుగుతుంది. ఆంధ్రలో అధికార తెదేపా విషయంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ విమర్శలు గుప్పిస్తుంటే, వాటికి తెదేపాలో నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ధీటుగా జవాబు చెప్పలేకపోతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో కాల్ మనీ, ఇసుక మాఫియా, సెక్స్ రాకెట్, కల్తీ మద్యం వంటివన్నీ వరుసపెట్టి బయటపడ్డాయి. దానితో తెదేపా నేతలు ఇంకా తడబడుతున్నారు. సరయిన సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి ఎదురయినప్పుడు తమను నిలదీస్తున్న ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. దాని వలన ప్రతిపక్షాలకి ప్రజల నుండి సానుభూతి, అధికార పార్టీ పట్ల ప్రజలలో అనుమానాలు, అపోహలు ఏర్పడుతున్నాయి.
తెరాసలో దూకుడు ఎక్కువ అవడం వలన విమర్శలు మూటగట్టుకొంటుంటే, ఆంధ్రాలో తెదేపాలో ఆ దూకుడు లోపించడం వలననే విమర్శలు మూటగట్టుకొంటున్నట్లు అర్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెదేపాలో జోరు పెరగవలసి ఉండగా, తెలంగాణాలో తెరాస జోరు తగ్గించుకోవలసి ఉందని అర్ధమవుతోంది. కనుక తెదేపా ప్రభుత్వం ఇకనయినా చాలా ఆచితూచి అడుగులు వేస్తూనే కొంచెం దూకుడుగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా తమ అంతః కలహాలను, విభేదాలను పక్కనపెట్టి అందరూ ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం కంటే తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేసుకోవడం మంచిది.