ఐసిస్ ఉగ్రవాదులు మజ్లీస్ పార్టీ అధినేత మరియు ఎంపి అసదుద్దీన్ ఓవైసీకి ట్వీటర్ ద్వారా హెచ్చరికలు పంపారు. ఐసిస్ కి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతామని హెచ్చరించారు. భారత్ లో కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థను వ్యాపింపజేస్తామని అందుకు ఎవరు అడ్డువచ్చినా హతమారుస్తామని హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. దానిపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ తాను అటువంటి బెదిరింపులకి భయపడబోనని తెలిపారు. హైదరాబాద్ కి చెందిన కొంతమంది ముస్లిం యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థవైపు ఆకర్షితులవుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తీరని అప్రదిష్ట కలిగిస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. కనుక ముస్లిం యువకులు అందరూ దానికి దూరంగా ఉండాలని హితవు పలికారు. భారత్ పై కన్నేసిన ఐసిస్ ఉగ్రవాద సంస్థను ముస్లింలందరూ గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. అందుకు ఆగ్రహించిన ఐసిస్ సంస్థ ఆయనకు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.