హైదరాబాద్: త్వరలో జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీడీపీ-బీజేపీ కూటమి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించబోతోందని వార్తలు రావటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే పవన్‌పై దాడి ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ పవనిజం తెలంగాణలో పనిచేయదని, పవన్ కళ్యాణ్‌ది పవనిజం కాదని, బ్రోకరిజం అని టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆయన నిన్న హైదరాబాద్ జాంబాగ్ డివిజన్లోని న్యూ ఉస్మాన్‌గంజ్ మైసమ్మ దేవాలయం వద్ద స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీనటుడు పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారని రవి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడని పవన్‌కు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పవన్ వచ్చినా ప్రజలు తిరగగొడతారని హెచ్చరించారు. అతను చెప్పేది, చేసేది ఒకటి కాదని రవి అన్నారు.