హైదరాబాద్: అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో సత్యసాయి నిగమాగమంలో జరిగింది. ఈ ఏడాది దర్శకుడు రాఘవేంద్రరావుకు ఈ అవార్డును బహూకరించారు. అల్లు కుటుంబసభ్యులు అరవింద్, అర్జున్, శిరీష్‌లతో పాటు చిరంజీవి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రులు గంటా, కామినేని, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు అశ్వనీదత్, శరత్ మరార్ తదితరులు హాజరయ్యారు. చిరంజీవి రాఘవేంద్రరావుకు అవార్డును, స్వర్ణ కంకణాన్ని, స్వర్ణ కిరీటాన్నిఅందించి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అల్లు రామలింగయ్యకు, తమ కుటుంబానికి రాఘవేంద్రరావు ఆప్తుడని చెప్పారు. తన మనసుకు చాలా దగ్గరైన వ్యక్తి రాఘవేంద్రరావు అని అన్నారు. ఆయన ఎన్టీఆర్‌తో 12 సినిమాలు రూపొందించారని, తనతోనూ 12 చిత్రాలు రూపొందించారని చెప్పారు. ఎన్టీఆర్‌కు ‘అడవి రాముడు’ను ఇస్తే తనకు ‘అడవి దొంగ’ను ఇచ్చారని అన్నారు. అడవిదొంగ సినిమాతో రాఘవేంద్రరావు తనను మాస్ హీరోగా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేయటంతోపాటు ఇండస్ట్రీలో తన సత్తా పెంచారని చిరంజీవి చెప్పారు.