హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విధించిన షరతులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. చరిత్రాత్మక జీఎస్టీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు మద్దతివ్వటానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని షరతులు విధించిందని, వాటిని తమ ప్రభుత్వం అంగీకరించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. కాంగ్రెస్ మద్దతిస్తే జీఎస్టీ బిల్లుకోసం పార్లమెంట్ సమావేశాలను ముందుకు జరపాలని ప్రభుత్వం యోచిస్తోందని వెంకయ్యనాయుడు ఇవాళ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేయటంకోసం ఆయన ఇవాళ ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని ఆమె నివాసంలో కలిశారు. తమ పార్టీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సోనియా చెప్పినట్లు వెంకయ్య నాయుడు వెల్లడించారు. వాస్తవానికి జీఎస్టీ బిల్లుకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ముందు పెడుతున్న బిల్లు పూర్తి తప్పుల తడక అని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం జీఎస్టీ రేటును 20% లోపే ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తోంది.