హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్ట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల ప్రక్రియను కుదిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీఓపై హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజునుంచి 31 రోజులలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీనితో ఈ ఎన్నికలు నిర్వహించటానికి గతంలో జనవరి 31 వరకు ఉన్న గడువును పొడిగించినట్లయింది. ఇంతకుముందు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ఈ ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి అవుతుంది. దీనిపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపైనే హైకోర్ట్ విచారణ జరిపి ఇవాళ స్టే ఇచ్చింది. కోర్ట్ తీర్పుపై మర్రి శశిధర్ రెడ్డి స్పందిస్తూ, ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయమని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం చేసిన కుట్ర హైకోర్ట్ తీర్పుతో భగ్నమయిందని అన్నారు. తమకు తెలిసిన రిజర్వేషన్లను ప్రతిపక్షాలకు తెలియకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మొత్తం మీద మర్రి శశిధర్ రెడ్డి ఈ విషయంలో విజయం సాధించారు. ఒక్క మర్రి శశిధర్ రెడ్డే కాక ప్రతిపక్షాల నాయకులందరూ ఎన్నికల ప్రక్రియను కుదిస్తూ అధికారపార్టీ తీసుకున్న నిర్ణయంపై కొద్దిరోజులుగా తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి తీర్పు ప్రభావంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్లను వచ్చే శనివారంలోగా ఖరారు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది ఇవాళ కోర్టుకు తెలిపారు.