జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఈరోజు ఉదయం డిల్లీలో మరణించడంతో ఆయన స్థానంలో ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అధికార పిడిపికి చెందిన 29 మంది శాసనసభ్యులు ఆమెను ఈరోజు తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని ఆమె నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తూ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వొహ్రాకి లేఖ ఇచ్చేరు.
పిడిపి ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని ముందే ప్రకటించింది. కనుక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా 56 ఏళ్ల మహబూబా ముఫ్తీ సయీద్ త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అంత్యక్రియలు ముగిసిన తరువాత ఆమె రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆమె ప్రస్తుత మంత్రివర్గాన్నే కొనసాగించవచ్చని సమాచారం. మహబూబా ముఫ్తీ ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు కనుక ఆమె తన ఎంపి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలలోగా రాష్ట్ర శాసనసభ లేదా విధానసభకు ఎన్నిక కావలసి ఉంటుంది.