లిబియాలో జ్లిటిన్ అనే పట్టణంలో పోలీస్ శిక్షణా కేంద్రంపై గురువారం ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు శిక్షణ పూర్తి చేసుకొన్న 60 మందికి పైగా పోలీసులు, కోస్ట్ గార్డ్ పోలీసులు మరణించారు. మరో 118 మందికి పైగా గాయపడినట్లు లిబియా హెరాల్డ్ పత్రిక తెలియజేస్తోంది. ఒక ఆయిల్ ట్యాంకర్ పై చాలా శక్తివంతమయిన బాంబుని అమర్చి దానితో లోపలకి దూసుకువచ్చి వారి మధ్య పేల్చి వేయడంతో భయానక విస్పోటనం జరిగిందని తెలుస్తోంది. ఆ ప్రేలుడు ధాటికి అక్కడ ఉన్నవారిలో చాలా మంది చనిపోగా కొంచెం దూరంలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ మిస్రత సెంట్రల్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి ప్రమాదకరం ఉంది. ఇంతవరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకొంటూ ప్రకటించలేదు. కానీ ఇది లిబియాని ఆక్రమిస్తున్న ఐసిస్ ఉగ్రవాదుల పనే అయ్యి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
లిబియా మాజీ అధ్యక్షుడు ముమ్మార్ గడ్డాఫీ ప్రభుత్వం 2011 సం.లో కూల్చివేసిన తరువాత నుండి ప్రభుత్వానికి, తిరుగుబాటు వర్గానికి మధ్య అంతర్యుద్దం కొనసాగుతోంది. లిబియాలో 2014 నుంచి ఆ రెండు వర్గాలు సమాంతరంగా పరిపాలన సాగిస్తూ ఒకదానిని మరొకటి దెబ్బ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అదే సం.లో ఐసిస్ ఉగ్రవాదుల మద్దతుతో తిరుగుబాటుదారులు లిబియా రాజధాని ట్రిపోలిని ఆక్రమించుకొన్నారు. అప్పుడు ప్రభుత్వం తూర్పు లిబియాలో తలదాచుకోవలసి వచ్చింది. ఆ రెండు వర్గాలకి మధ్య ఐక్యరాజ్యసమితి శాంతి కుదిర్చి అధికారంలో ఇరువర్గాలు పాలుపంచుకొనేలా డిశంబర్ 17, 2014లో ఒక శాంతి ఒప్పందం కుదిర్చింది. కానీ తిరుగుబాటుదారులు దానికి కట్టుబడి ఉండకపోవడంతో అది ఇంతవరకు అమలు కాలేదు. ఇదే సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోయి లిబియాలో ప్రధాన పట్టణమయిన సిర్తేను ఆక్రమించుకొన్నారు. అక్కడ నుంచే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లను ఐసిస్ ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. వారి జాడ ఇంతవరకు తెలియకపోవడంతో వారిరువురూ ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో మరణించి ఉంటారని అందరూ భావిస్తున్నారు.
సిర్తే పట్టణాన్ని ఆక్రమించుకొన్న ఐసిస్ ఉగ్రవాదులపై రష్యా వాయుసేన గత కొన్ని రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తూండటంతో అనేకమంది ఉగ్రవాదులు చనిపోయారు. వారు తమ ఉనికిని చాటుకొనేందుకు ఈదాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.