బిహార్ ఎన్నికల ముందు మొదలయిన ‘మత అసహనం’ ప్రచారం ఆ ఎన్నికలతోనే ముగిసిపోయింది. కానీ ఆ సమయంలో ఒత్తిళ్లకు లొంగడం వలననో లేదా ఉచిత పబ్లిసిటీ కోసమో దేశంలో అనేక మంది ప్రముఖులు తాము అందుకొన్న ప్రతిష్టాత్మకమయిన అవార్డులను కేంద్రప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసారు. మరి కొందరు మీడియా ముందుకు వచ్చి నానాటికి పెరిగిపోతున్న ఈ మత అసహనం వలన దేశంలో బ్రతకడం కష్టమయిపోతోంది…వేరే దేశానికి వెళ్ళిపోవాలనిపిస్తోంది అంటూ ఏవేవో చాలా మాట్లాడేశారు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం విసిరిన ఆ మత అసహన ఉచ్చులో చిక్కుకొన్న వారందరూ ఇప్పుడు తాపీగా బాధపడుతున్నారు. వారిలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కూడా ఒకరు. ఇదివరకు ఆయన “ఇంక్రెడిబుల్ ఇండియా” ప్రచారకర్తగా ఉండేవారు. మత అసహనంపై నోరు జారినందుకు, కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఆయన స్థానంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాభ్ బచ్చన్ ని ప్రచారకర్తగా నియమించింది.
దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ “అటువంటి నిర్ణయం తీసుకొనే పూర్తి హక్కు కేంద్రప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. నేను ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా పనిచేసినా పనిచేయకపోయినా, భారత్ ఎల్లప్పుడూ ఉజ్వలంగానే ఉండాలని కోరుకొంటున్నాను. అలాగ ఉండటమే సరయినది కూడా. దేశం కోసం ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ఇంత కాలం నేను భాగం పంచుకొన్నందుకు చాల సంతోషిస్తున్నాను. గర్వపడుతున్నాను. దేశ ప్రయోజనాల కోసం తీసిన డాక్యుమెంటరీ చిత్రాలలో నటించినందుకు నేను ఎటువంటి ఫీజు తీసుకోలేదు. దేశం కోసం ఎటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. నేను ఎల్లప్పుడూ అందుకు సంసిద్ధమే,” అని అన్నారు.
ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచార కర్తగా ఉన్న అమీర్ ఖాన్ న్ని తొలగించి ఆయన స్థానంలో తనని నియమించడంపై అమితాభ్ బచ్చన్ స్పందిస్తూ “బహుశః అమీర్ ఖాన్ కాంట్రాక్టు ముగియడం చేతనే నన్ను ఎంపిక చేసారని భావిస్తున్నాను. ఒకవేళ వేరే ఇతరత్రా కారణాలు ఏవయినా ఉంటే అది ఆయననే అడిగి తెలుసుకోవడం మంచిది. అయినా ఏవో అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన్న ఇటువంటి కార్యక్రమాలలో వ్యక్తులను మార్చుతారని నేను భావించడం లేదు. ఏవో కొన్ని అపోహలు కారణంగానే ప్రజలలో ఇటువంటి అభిప్రాయలు నెలకొని ఉన్నాయని నేను భావిస్తున్నాను,’ అని అన్నారు.